డిసెంబరు 15 వరకు ‘సర్‌’ క్లెయిమ్‌ల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

డిసెంబరు 15 వరకు ‘సర్‌’ క్లెయిమ్‌ల పరిష్కారం

Nov 23 2026 5:18 AM | Updated on Nov 23 2026 5:18 AM

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఓటర్ల జాబితా నోటీసు దశ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను డిసెంబరు 15 వరకు ఎన్నికల సంఘం పొడిగించిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్‌ తెలిపారు. డిసెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు..

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌’ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ జిల్లా ప్రజలకు సూచించారు. ఫిర్యాదులను మీ కోసం పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదు సమాచారం తెలుసుకోవడానికి 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు. అదే విధంగా 95523 00009 వాట్సాప్‌ గవర్నెన్స్‌ నంబర్‌ ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేయవచ్చన్నారు.

నేడు మేయర్‌ ప్రమాణ స్వీకారం

అనంతపురం: నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా సి.రమేష్‌ గౌడ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంతో పాటు డిప్యూటీ మేయర్‌ ఎన్నిక, నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి నగర పాలక సంస్థ కార్యాలయం ముస్తాబైంది. ఉదయం 8.30 గంటలకు హెచ్చెల్సీ కాలనీలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో నూతన మేయర్‌, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు భారీ ర్యాలీగా బయలుదేరుతారు. జెడ్పీ ఆవరణలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకుంటారు.

వైఎస్సార్‌సీపీలో

ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

అనంతపురం: అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులపై సస్పెన్షన్‌ వేటు పడింది. సస్పెండైన వారిలో అనంతపురం రూరల్‌ మాజీ వైస్‌ ఎంపీపీ గుండ్లమడుగు బాలాజీ, రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్‌ నరేంద్రరెడ్డి ఉన్నారు. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి, ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇద్దరినీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్‌ చేసినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ నిర్ణయం ద్వారా అధిష్టానం సంకేతాలు పంపినట్లయ్యింది.

నకిలీ పోలీసుల పట్టివేత

కళ్యాణదుర్గం రూరల్‌: కంబదూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులమని చెప్పుకుంటూ వాహనదారులను బెదిరించి డబ్బులు దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గుంతకల్లుకు చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌, అలీ అబ్బాస్‌ అనే ఇద్దరు యువకులు వ్యసనాలకు బానిసలయ్యారు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం నకిలీ పోలీసులుగా అవతారమెత్తారు. నకిలీ ఐడీ కార్డు, క్యాపులు ధరించి పోలీసులుగా నటిస్తూ వాహనదారులను బెదిరించి నగదు వసూళ్లు చేస్తున్నారు. ఈ నెల 21న కళ్యాణదుర్గం – నూతిమడుగు మార్గంలోని వైసీ పల్లి వద్ద వృద్ధుడిని ఆపి రూ.5,500 లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కంబదూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం నూతిమడుగు శివారులో అనుమానాస్పదంగా కనిపించిన సయ్యద్‌ ఇమ్రాన్‌, అలీ అబ్బాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. నకిలీ పోలీసుల బండారం బట్టబయలైంది. వీరిద్దరూ గతంలో బెళుగుప్ప, యాడికి, గుంతకల్లు, కర్నూలు జిల్లా పరిధిలో నమోదైన పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు విచారణలో తేలింది. వీరి నుంచి రూ.5,500 నగదు, ఐడీ కార్డు, పోలీస్‌ జంగిల్‌ క్యాపులు, ఒక కత్తి, బైక్‌, మొబైల్‌ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ గోపీ యాదవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement