అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. ఏకగ్రీవాలతో కొన్ని చోట్ల ఎన్నికల పోరు ముగియగా, మిగిలిన పంచాయతీల్లో ప్రచార హోరు మొదలైంది. గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 8 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బొమ్మనహాళ్ మండలంలో నాలుగు, బ్రహ్మసముద్రం, డి.హీరేహాళ్ మండలాల్లో ఒక్కొక్కటి, కణేకల్లు మండలంలో రెండు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
210 పంచాయతీల్లో హోరాహోరీ..
ఈ నెల 26న తొలి విడతలో అనంతపురం రూరల్, ఆత్మకూరు, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, కుందుర్పి, రాప్తాడు, రాయదుర్గం, శెట్టూరు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 218 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎనిమిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 210 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో 539 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
1,835 వార్డు స్థానాలకు పోటీ..
వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల సంఖ్య గణనీయంగా నమోదైంది. మొత్తం 2,317 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 482 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బొమ్మనహాళ్ మండలంలో అత్యధికంగా 120 వార్డులు ఏకగ్రీవం కాగా, డి.హీరేహాళ్‌లో 68, గుమ్మఘట్టలో 54, అనంతపురం రూరల్‌లో 53, బ్రహ్మసముద్రంలో 45, కణేకల్లులో 38, రాయదుర్గంలో 34, కళ్యాణదుర్గంలో 22, ఆత్మకూరులో 18, రాప్తాడులో 18, శెట్టూరులో 9, కుందుర్పిలో 2, కంబదూరులో ఒక వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,835 వార్డులకు 3,786 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
గ్రామాల్లో సందడే సందడి..
అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించడంతో ప్రచారానికి అసలైన ఊపొచ్చింది. ఆదివారం ఉదయం నుంచే అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇంటింటి ప్రచారం, మద్దతుదారులతో ర్యాలీలు, స్థానిక సమస్యలపై హామీలు.. ఇలా గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
హోరాహోరీగా పల్లె పోరు
‘తొలివిడత’లో 8 చోట్ల సర్పంచ్‌లు,
482 వార్డు స్థానాలు ఏకగ్రీవం
210 పంచాయతీల్లో 539 మంది సర్పంచ్ అభ్యర్థుల అదృష్ట పరీక్ష
1,835 వార్డుల్లో 3,786 మంది
అభ్యర్థుల పోటీ
గెలుపు కోసం ఎత్తులకు పైఎత్తులు


