నవంబరు నెలకు సంబంధించి బియ్యం, ఇతర రేషన్ సరుకులను గత నెలలో ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద ఇచ్చారు. ఈ క్రమంలో రేషన్ డీలర్ల సంఘం పేరిట కొంతమంది నాయకులు ఒక్కో డీలర్ నుంచి 35 కిలోల జొన్నలు, వంద కిలోల (50 కిలోల బస్తాలు రెండు) బియ్యం తీసుకున్నారు. మరో డీలర్ కోటా నుంచి 50 కిలోల బస్తా జొన్నలు తీసుకున్నారు. ఎందుకు ఇవ్వాలని అడిగితే... ‘ఇవ్వకపోతే మీ డీలర్‌షిప్ తొలగిస్తాం’ అని బెదిరించారు. ఇది ఈ ఒక్క నెల మాత్రమే కాదు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేషన్ దందా సాగుతూనే ఉంది.
● డీలర్ల సంఘం పేరుతో దందా
● ప్రతి నెలా బియ్యం, జొన్నలు ఇవ్వాల్సిందే
● ఇవ్వకుంటే ఎమ్మెల్యేకు చెప్పి డీలర్‌షిప్ రద్దు చేస్తామని డీలర్లకు బెదిరింపులు
అనంతపురం అర్బన్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బియ్యం కార్డుదారులకు చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం రేషన్ సరుకులు అందిస్తోంది. పౌరసరఫరాల సంస్థ ప్రతి నెలా మండల లెవల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్‌ఎస్) నుంచి డీలర్లకు సరుకులు పంపిణీ చేస్తోంది. అక్కడి నుంచి చౌకధాన్యపు దుకాణాలకు చేర్చి.. కార్డుదారులకు అందజేస్తారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఎంఎల్‌ఎస్ కేంద్రంగా రేషన్ దందా సాగుతోంది. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పేరుతో కొందరు నాయకులు అక్కడ తిష్ట వేసి.. ప్రతి డీలర్ నుంచి 30 నుంచి 50 కిలోల దాకా జొన్నలు, 100 కిలోల బియ్యం అనధికారికంగా తీసుకుంటున్నారు. ఎవరైనా ఇవ్వకుంటే అర్బన్ ఎమ్మెల్యేకు చెప్పి డీలర్‌షిప్ రద్దు చేయిస్తామని బెదిరిస్తున్నారు. వారిని ఎదిరించే ధైర్యం లేక డీలర్లు మిన్నకుండిపోతున్నారు. అర్బన్ పరిధిలో 137 చౌకధాన్యపు దుకాణాలు (స్టోర్లు) ఉండగా.. ఇందులో 80 దుకాణాల డీలర్ల నుంచి ప్రతి నెలా సరుకులు దండుకుంటున్నారు. ఎమ్మెల్యేకు బాగా తెలిసిన వారు, కావలసిన వారు ఉంటేవారిని వదిలేసి.. మిగిలిన వారి నుంచి భయపెట్టి మరీ పేదల సరుకులను లాగేసుకుంటున్నారు. చివరకు డీలర్లు.. తక్కువ తూకాలతో కార్డుదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నారు.
బ్లాక్ మార్కెట్‌కు బియ్యం
ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో రేషన్ (చౌక) బియ్యానికి డిమాండ్ పెరిగింది. ఇది కొందరు నాయకులకు కలిసి వచ్చింది. డీలర్ల నుంచి దండుకున్న బియ్యాన్ని కిలో రూ.25 నుంచి రూ.30 చొప్పున బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. డీలర్ల నుంచి వీరు బియ్యం, జొన్నలు దోచుకుంటున్న విషయం ప్రజాప్రతినిధికి తెలిసినా పట్టించుకోవడం లేదని కొందరు బాధిత డీలర్లు వాపోతున్నారు. మండల లెవల్ స్టాక్ పాయింట్ కేంద్రంగా రేషన్ దందా సాగుతున్నా.. చౌక దుకాణాల్లో కార్డుదారులకు సరుకుల తూకాల్లో కోత విధిస్తున్నా పౌర సరఫరాల సంస్థ చేష్టలుడిగి చూస్తుండటం.. విమర్శలకు తావిస్తోంది.


