ఆంధ్రకు అసోం షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రకు అసోం షాక్‌

Nov 7 2026 12:06 AM | Updated on Nov 7 2026 12:06 AM

అనంతపురం: అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న బీసీసీఐ కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ అండర్‌–23 ఎలైట్‌ క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర జట్టుకు అసోం జట్టు గట్టి షాక్‌ ఇచ్చింది. నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆంధ్ర అండర్‌–23 జట్టును ఇన్నింగ్స్‌ 24 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో అసోం జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు 202 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అసోం జట్టు 141.5 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆంధ్రపై భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లోనే వెనుకబడిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ కోలుకోలేకపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 83/3తో శుక్రవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు అసోం బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. మిగిలిన ఏడు వికెట్లను కాపాడుకోవడంలో విఫలమై, భోజన విరామానికి ముందే ఆలౌటైంది. 44.1 ఓవర్లలో 161 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌ ముగించింది. ఆంధ్ర తరఫున టీవీ సాయి శ్రవణ్‌ 50 బంతుల్లో నాలుగు ఫోర్లతో 36 పరుగులు, వరుణ్‌ సాత్విక్‌ 81 బంతుల్లో ఐదు ఫోర్లతో 34 పరుగులు చేశారు. ఎంకే దత్తారెడ్డి 51 బంతుల్లో మూడు ఫోర్లతో 17 పరుగులు సాధించాడు. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో ఆంధ్ర జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. అసోం విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఆల్‌రౌండర్‌ ఆయుష్మాన్‌ మలాకర్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.

క్రికెట్‌ ప్రముఖుల సందర్శన

మ్యాచ్‌ ముగింపు కార్యక్రమానికి బీసీసీఐ జూనియర్‌ ఇండియా సెలెక్టర్‌ కృష్ణదాస్‌ హాజరయ్యారు. అనంతపురం జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సి.శ్రీనాథ్‌, కార్యదర్శి టి.శ్రీధర్‌, సంయుక్త కార్యదర్శి ఎన్‌.సర్దార్‌, ఏసీఏ సౌత్‌జోన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పీకే సాగర్‌ చౌదరి, సెలక్షన్‌ కమిటీ అబ్జర్వర్‌ జి.సీతారామరావు పాల్గొన్నారు. ఏసీఏ, ఆర్డీటీ ప్రోగామ్‌ డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ సహకారంతో అనంతపురంలో ప్రతిష్టాత్మక బీసీసీఐ టోర్నీల నిర్వహణకు అవకాశం లభించిందని జిల్లా క్రికెట్‌ సంఘం ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement