● నూతన ప్రజాప్రతినిధులకు ‘అనంత’ దిశానిర్దేశం
అనంతపురం: నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని నూతన ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా జరిగి ఉంటే రాష్ట్రమంతటా అనంతపురం ఫలితాలే ప్రతిబింబించేవని పేర్కొన్నారు. నాయకుల సమష్టి పోరాటం, అంకితభావం, వైఎస్సార్‌సీపీని గెలిపించాలనే ఆరాటంతోనే మేయర్ పీఠాన్ని కై వసం చేసుకోగలిగామని పార్టీ అధినేత వైఎస్ జగన్ కొనియాడారని తెలిపారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నూతన మేయర్ రమేష్ గౌడ్, కార్పొరేటర్లతో పాటు పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక నాయకులతో అనంత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం వెనుక ప్రతి ఒక్కరి కృషీ ఉందన్నారు. వివాదాలు, అవినీతికి దూరంగా ఉంటూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి అంకితభావంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు దాడులు, దౌర్జన్యాలు చేసినా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు భయపడకుండా పోరాడారని ప్రశంసించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నగరంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. ప్రజలు అన్నింటినీ గమనించి అరాచకాలకు చెక్ పెడుతూ వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సమన్వయంతో పనిచేసి అనంతపురం నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
సుందర నగరంగా తీర్చిదిద్దుతాం
అందరి సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని నూతన మేయర్ రమేష్‌గౌడ్ తెలిపారు. అవినీతిరహిత పాలన అందించడమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. తమ గెలుపునకు సహకరించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


