యల్లనూరు: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆదివారం రాత్రి తిమ్మంపల్లిలోని నివాసంలో పుట్లూరు సీఐ వంశీ కృష్ణ, ఎస్‌ఐలు రామాంజనేయరెడ్డి, ధరణిబాబు అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో తిమ్మంపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మిద్దె మనీష నామినేషన్‌ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో తిమ్మంపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని మనీషను సాయంత్రం 5 గంటల వరకూ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు నిర్భంధించారు. ఈ క్రమంలో ఆదివారం పెద్దారెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ తరుణంలో అక్రమ కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను అనంతపురంలోని ఇంటికి తరలించారు. కాగా అంతకుముందు ఉదయం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. తాడిపత్రిలో గొడవల కారణంగా తిమ్మంపల్లిలోనే ఉండాలని సూచించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
విడపనకల్లు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి ఆదివారం అధికారులు తాళం వేశారు. ప్రాదేశిక ఎన్నికల నిబంధనల ప్రకారం ఆదివారం కూడా ఎన్నికల అధికారులు కార్యాలయం తెరిచే ఉంచాలి. అయితే అధికారులు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా కార్యాలయానికి తాళం వేయడంతో పలు పార్టీలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడానాకి గంటల తరబడి కార్యాలయం వద్ద వేచి చూసినా .. అధికారులు రెండు గంటలైనా రాకపోవడంతో అభ్యర్థులు వెనుతిరిగారు. ఎన్నికల నిబంధనలు పాటించని ఆర్‌ఓ నరసారెడ్డిపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ఏఆర్వో, మిగతా అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని నామినేషన్ వేసిన ఎంపీటీసీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.
‘ఆపస్’ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనంతపురం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కళ్యాణి, ప్రధాన కార్యదర్శిగా వై.రామన్న, గౌరవాధ్యక్షుడిగా టి.నారాయణస్వామి, జిల్లా సహాధ్యక్షుడిగా పి.శివప్రసాద్‌నాయుడు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం నగరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తూ, వారి హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఎన్నికల అధికారులుగా రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర ప్రసాద్, రాజేంద్రప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకట సత్యనారాయణ, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి, కళ్యాణదుర్గం జోనల్ అధ్యక్షుడు మల్లికార్జున పాల్గొన్నారు.
రైలు కింద పడి
యువకుడి ఆత్మహత్య
గుత్తి: గుత్తి జీఆర్‌పీ పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి సుధీర్ కుమార్‌రెడ్డి (35) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. గుత్తిలోని నేహా నగర్‌కు చెందిన సుధీర్‌కుమార్ రెడ్డి సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, జీఆర్‌పీ పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనపై జీఆర్‌పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కళ్యాణి రామన్న


