అనంతపురం: అరాచక శక్తుల నుంచి అనంతపురాన్ని కాపాడుకోవాలంటే నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని 27, 28, 29, 49, 50 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్, ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు సులోచన, కృష్ణనవ్య, కొండ్రెడ్డి భారతి, ఆరీఫాతో పాటు సీపీఐ కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీదేవి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని గెలవాలనే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఓడిపోవడం ఖాయమని గుర్తించిన కూటమి నాయకులు అరాచకాలకు తెరలేపారన్నారు. ఎన్నికల ప్రచారంలో తాము ఇంటింటికీ వెళ్తుంటే వైఎస్ జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య తేడాను ప్రజలే బేరీజు వేసుకుంటున్నారన్నారు. రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఇక్కడి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఎలా దోపిడీ చేశారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ‘ప్రజాసేవ కోసం కాదు.. ఈ అనంతపురాన్ని దోచుకునేందుకే వాళ్లు ఎమ్మెల్యే అయ్యారు’ అంటూ ఓటర్లే చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. భూకబ్జాలు, దందాలు, అరాచకాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు పెరిగిపోయి ప్రజల స్థిరాస్తులకు భద్రత లేకుండా పోయిందన్నారు. నగరం ప్రశాంతంగా ఉండాలన్నా, జవాబుదారీ పాలన కావాలన్నా ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్‌తో పాటు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగరానికి, ప్రజల ఆస్తులకు కాపలాదారులుగా తాము ఉంటామని భరోసానిచ్చారు.
బీజేపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించండి
మేయర్ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అజేష్ బాబును చిత్తుగా ఓడించాలని సీపీఐ సీనియర్ నేత జగదీష్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం 49, 50 డివిజన్లలో ఆయన వైఎస్సార్‌సీపీ, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మేయర్ అభ్యర్థి రమేష్‌గౌడ్‌తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్‌తో పాటు రాష్ట్ర నాయకులంతా వచ్చి అనంతపురం ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపుతున్నారని విమర్శించారు. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొని, ప్రజలు సంతోషంగా జీవించాలంటే వైఎస్సార్‌సీపీ, సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండ్రెడ్డి ఓబిరెడ్డి, జిల్లా కార్యదర్శి సంపంగి రామాంజనేయులు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీతోనే జవాబుదారీ పాలన
ప్రజల ఆస్తులకు మేమంతా రక్షణగా నిలుస్తాం
ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత


