అనంతపురం: స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయుల అరాచకాలను అరికట్టాలని వైఎస్సార్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆయన కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. గుంతకల్లు, గుత్తి, పామిడి మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు వర్గీయులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, కిడ్నాప్ చేయడం, నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడం లాంటి అరాచకాలకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ముందస్తుగా గృహనిర్బంధం చేస్తుంటే, అధికార పార్టీ నేతలు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని, గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన హింసాత్మక ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని, స్థానిక ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరారు. ఇదే విషయమై ఎస్పీ జగదీష్‌ను కూడా కలిసి వెంకటరామిరెడ్డి విన్నవించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు తిప్పేస్వామి, యుగంధర్‌రెడ్డి, జయరామిరెడ్డి, సోమిరెడ్డి పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి
కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి వినతి


