గుంతకల్లు – విశాఖ రైలు తిరుపతి వరకే | - | Sakshi
Sakshi News home page

గుంతకల్లు – విశాఖ రైలు తిరుపతి వరకే

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

● ధర్మవరం– మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ నాలుగు గంటల అలస్యం

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి మీదుగా వెళ్లే గుంతకల్లు–విశాఖ వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 18522) రైలును తిరుపతి వరకు మాత్రమే నడపనున్నామని రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. అర్నబ్‌ తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తిరుపతి వరకు పరిమితం చేశారు. తుపాన్‌ తీవ్రతను బట్టి విశాఖ వరకు పొడిగించడమా లేక తిరుపతికే పరిమితం చేయడమా అనేది నిర్ణయించనున్నారు. తాడిపత్రి మీదుగా ధర్మవరం– మచిలీపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 17216) రైలు నాలుగు గంటల ఆలస్యంగా నడుస్తోంది. తాడిపత్రి రైల్వే స్టేషన్‌కు రాత్రి 7.38 గంటలకు రావాల్సిన రైలు రాత్రి 11.38 గంటలకు రానుంది. ధర్మవరం రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరాల్సిన రైలు రాత్రి 9.50 గంటలకు బయల్దేరనుంది.

కూటమి రెబల్స్‌కు

‘పచ్చ’ బెదిరింపులు

గుత్తి: మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే కాదు ఇప్పుడు కూటమి రెబల్‌ అభ్యర్థులకు టీడీపీ నేతల నుంచి బెదిరింపులు తప్పడం లేదు. మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే దాడులు, దౌర్జన్యాలు, రౌడీయిజం, బెదిరింపులతో 27 స్థానాలకు ఇతర పార్టీల నుంచి నామినేషన్లు వేయకుండా చేసి టీడీపీ తన ఖాతాలో వేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మిగిలిన ఐదింటిలో మూడు కౌన్సిలర్‌ స్థానాలను జనసేనకు, ఒకటి టీడీపీకి, మరొకటి బీజేపీకి కేటాయించారు. అయితే జనసేనకు కేటాయించిన మూడు స్థానాల్లో టీడీపీ తరఫున రెబల్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. మరొక వార్డులో బీజేపీకి సీపీఎం అభ్యర్థి పోటీగా నిలిచారు. మరొక స్థానంలో టీడీపీకి రెబల్‌గా మరొకరు పోటీలో ఉన్నారు. పొత్తు ధర్మం పాటించకుండా తూట్లు పొడుస్తున్నారంటూ టీడీపీపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నేతలు అపరిచిత నంబర్ల నుంచి జనసేనతో పాటు టీడీపీ రెబల్‌ అభ్యర్థులకు ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పుకుంటే ‘కూటమి’ పరువు పోతుందని సదరు అభ్యర్థులు లోలోన మదన పడుతుండటం గమనార్హం.

పంచాయతీ

కార్యదర్శిపై ఫిర్యాదు

విడపనకల్లు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కరకముక్కల పంచాయతీ కార్యదర్శి సింగాల లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నసరారెడ్డికి ఫిర్యాదు చేశారు. లోకేష్‌ స్వస్థలం వి.కొత్తకోట అని, వీరిది టీడీపీ సానుభూతిపరుల కుటుంబమని పేర్కొన్నారు. ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో లోకేష్‌ తన బంధువు టీడీపీ అభ్యర్థి సింగాల బండి నాగవేణికి సహకరించారని ఆరోపించారు. ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సింగాల చంద్రకళ నామినేషన్‌ పత్రాలను స్కాన్‌ చేసి.. తన బంధువులకు చేరవేశారన్నారు. స్కూటినీలో ఏ అంశంపై అభ్యంతరం తెలిపితే నామినేషన్‌ను తిరస్కరిస్తారో మార్గనిర్దేశనం చేశాడన్నారు. బంధుప్రీతితో విధులు నిర్వర్తించి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించేందుకు సహకరించిన సదరు పంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధులకు ఆయన్ను దూరంగా ఉంచాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ విభాగం ప్రధాన కార్యదర్శి కరణం భీంరెడ్డి, జిల్లా కార్యదర్శి భరత్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ కురుబ రమేష్‌, మాజీ ఎంపీటీసీ కాక తిమ్మారాజు, పార్టీ యువజన విభాగం మండల నాయకులు మువ్వా హనుమంతు శింగాల ముద్దన్న తదితరులు డిమాండ్‌ చేశారు. దీనిపై విచారణ చేసి.. చర్యలు తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement