అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరులు ప్రత్యర్థి పార్టీ నేతలపై భౌతికదాడులు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. వజ్రకరూరు మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను మంత్రి అనుచరులు రాత్రికి రాత్రే అపహరించి, భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా వారిచేత నామినేషన్లను విత్ డ్రా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలు, కిడ్నాప్ ఘటనలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీ లేకుండా చేసుకునేందుకు కుట్రలు పన్నారన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే కిడ్నాప్..
వజ్రకరూరులో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త మంగళవారం ఇంట్లో టిఫిన్ చేస్తుండగా కార్లలో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారని పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ మోనాలిసా ఆరోపించారు. ఓటమి భయంతోనే టీడీపీ వారు తన భర్తను అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే దానికి ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కోరారు.
రెచ్చిపోతున్న మంత్రి పయ్యావుల అనుచరులు
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో బలవంతంగా విత్‌డ్రా చేయించారు
కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు


