● మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్
అనంతపురం: బుక్కరాయసముద్రం మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ, అలాగే అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసిన (విత్ డ్రా) ఘటనలపై సమగ్ర విచారణ చేయించాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆనంద్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పలు గ్రామాలు, పంచాయతీలలో కొందరు స్థానిక అధికారులు, పోలీసు సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని అన్ని గ్రామాలతో పాటు, నార్పల, బుక్కరాయసముద్రం, శింగనమల, గార్లదిన్నె మండలాల్లోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలతో భద్రత కల్పించాలన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ప్రచారం నిర్వహించేందుకు తగిన పోలీసు రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, యువ నాయకులు సాకే రుత్విక్ హృదయ్, బోనాల హరికృష్ణ, శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


