గుంతకల్లు: నామినేషన్ కేంద్రాల వద్ద పచ్చమూకలు గుంపులు, గుంపులుగా ఉంటూ కత్తులు, కొడవళ్లతో అభ్యర్థులను భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారికి పోలీసు 30 యాక్ట్ వర్తించదా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీ.జగదీష్ పోలీసులను నిలదీశారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గుండాలు సృష్టిస్తున్న అల్లర్లకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని కాపాడాలంటూ స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా సీఐ రమేష్‌కుమార్ అక్కడికి చేరుకుని పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని లేనిపక్షంలో మీపై కేసులు పెడతామంటూ జగదీష్‌తోపాటు ఆ పార్టీ నేతలను హెచ్చరించారు. దీంతో జగదీష్ సీఐపై మండిపడ్డారు. నామినేషన్ కేంద్రాల వద్ద అధికారి పార్టీకి చెందిన కార్యకర్తలు గుంపులుగుంపులుగా కత్తులు, కొడవళ్లతో తిరుగుతూ అభ్యర్థులను భయాబాంత్రులకు గురి చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను అడ్డుకోవడం మంచి పద్ధతికాదని హితవుపలికారు. ఈ సందర్భంగా జగదీష్ విలేకరులతో మాట్లాడుతూ గుంతకల్లులో గుమ్మనూరు మార్క్‌తో ఏకపక్షంగా ఎన్నికల జరిపించాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు. నాయకులు బీ.గోవింద్, ఎం.వీరభద్రస్వామి, ఎస్‌ఎండీ గౌస్, రామురాయల్, ఈశ్వరయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.


