రాత్రి వేళల్లో ప్రిన్సిపాల్‌ గదిలో అదే పని! | Kalyanadurgam Gurukul school Principal Praveenkumar Incident | Sakshi
Sakshi News home page

రాత్రి వేళల్లో ప్రిన్సిపాల్‌ గదిలో అదే పని!

Oct 25 2026 10:10 AM | Updated on Oct 25 2026 10:14 AM

Kalyanadurgam Gurukul school Principal Praveenkumar Incident

ప్రతీకాత్మక చిత్రం

అనంతపురం: కళ్యాణదుర్గ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. బాడీ మసాజ్‌ చేయడంతో పాటు తన వ్యక్తిగత పనులకు, ఇంటి పనులకు సిబ్బందిని పురమాయిస్తుండటం, మాట వినకపోతే వేధింపులకు గురిచేస్తుండటం కలకలం రేపుతోంది. ప్రిన్సిపాల్‌ బాడీ మసాజ్‌ చేయించుకుంటున్న దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. బాధితుడు రాసిన లేఖలోని సారాంశం ఇలా ఉంది. కళ్యాణదుర్గంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా ఎం.ప్రవీణ్‌కుమార్‌ ఆరు నెలల కిందట బాధ్యతలు స్వీకరించారు. 

కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఆయన ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. అయితే ఈయన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్సీ, బీఈడీ చేసిన దళవాయి మృత్యుంజయ అవుట్‌సోర్సింగ్‌ కింద అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేస్తున్నారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం నాణ్యతగా లేదంటూ మృత్యుంజయను మందలించి.. తన వ్యక్తిగత గదికి పిలిపించుకుని సపర్యలకు వినియోగించుకుంటున్నారు. రోజూ రాత్రి 8 నుంచి 10.30 గంటల వరకు బాడీ మసాజ్‌ మెషిన్‌ ద్వారా మసాజ్‌ చేయించుకుంటున్నారు. అంతటితో ఆగక ఆయన బట్టలు, లోదుస్తులను కూడా శుభ్రం చేయించుకుంటున్నారు. ఆ పనులు చేయడానికి నిరాకరిస్తే మృత్యుంజయను గేటు బయటే పెట్టి పనిష్మెంట్ ఇస్తున్నారు. 

విధిలేని పరిస్థితుల్లో అయిష్టంగా పనులు చేయాల్సి వస్తోందని అసిస్టెంట్‌ కుక్‌ చెబుతున్నాడు. తన భార్యకు ఆరోగ్యం బాగలేదని, ఇంటికెళ్తానని చెప్తే పంపకుండా వేధిస్తున్నాడని తెలిపాడు. ప్రిన్సిపాల్‌ తీరుతో విసిగిపోయిన అసిస్టెంట్‌ కుక్‌ ఈ నెల 22వ తేదీన తన బాధనంతా ఓ లేఖలో రాసి ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వెంకటప్ప, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. ప్రిన్సిపాల్‌ వేధింపులు తాళలేక ఓ మహిళా సిబ్బంది తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయిందని, పాఠశాలలో తనకు అనుకూలంగా లేని ఉపాధ్యాయులకు ఏదో ఒక సాకుతో మెమోలు ఇచ్చి వారి నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తూ వేధిస్తున్నాడని లేఖలో ఆరోపించాడు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్‌కు బాడీ మసాజ్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి గిరిజ సంక్షేమ శాఖ అధికారులు విచారణ సైతం చేపట్టారు.

ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌ కుమార్‌ (ఫైల్‌)   

అవును.. కొంతసేపు చేయించుకున్నా.. 
నేను స్వగ్రామం వెళ్లి వచ్చినపుడు ఒంట్లో నలతగా ఉంటే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అయిన వాచ్‌మెన్‌ (అసిస్టెంట్‌ కుక్‌) మృత్యుంజయతో బాడీ మసాజ్‌ మిషన్‌ ద్వారా కొంతసేపు మసాజ్‌ చేయించుకున్నాను. ఇష్టపూర్వకంగా చేస్తాడనే అనుకున్నాను. కానీ అతను ఇలా చేస్తాడని అనుకోలేదు. పాఠశాలలో శుభ్రంగా ఉండాలని అతనికి చెప్పాను. ఇది నచ్చక.. నాపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నాడు.  
– ఎం.ప్రవీణ్‌ కుమార్, ప్రిన్సిపాల్, ఎస్టీ గురుకుల పాఠశాల 

ఉన్నతాధికారులకు నివేదించాం 
కళ్యాణదుర్గం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలపై సిబ్బందిని విచారించాం. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో మసాజ్‌ చేయించుకోవడం తప్పు. ప్రిన్సిపాల్‌ వివరణనూ తీసుకున్నాం. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదించాం.  
– ఎం.శ్రీనివాసరావు, డీటీడబ్ల్యూఓ, అనంతపురం    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement