● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
రాప్తాడు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు కొనసాగిస్తున్న దమనకాండను ఇప్పుడు మండల, గ్రామస్థాయి ఎన్నికలకూ విస్తరించిందన్నారు. బుధవారం ఆయన అనంతపురం నగర శివారులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ వర్గీయులు ప్రయత్నించారన్నారు. ఆత్మకూరులో ఎంపీటీసీ అభ్యర్థి వెంకటేష్‌నాయక్‌పై దాడి చేశారని, అనంతపురం రూరల్‌లో పార్టీ కార్యకర్త శ్రీరామిరెడ్డిపై దాడులకు పాల్పడ్డారన్నారు. చియ్యేడు దళిత మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించివేశారని, రాప్తాడు మండలం మరూరులో ఎంపీటీసీ అభ్యర్థిని ప్రతిమ నామినేషన్ వేస్తుండగా పత్రాలను లాక్కుని చించేశారని ఆరోపించారు. చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లికి చెందిన అభ్యర్థిని సైతం అడ్డుకున్నారని తెలిపారు.
టీడీపీ గూండాలపై పోలీసుల చర్యలేవీ?
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాల కోసం అధికారులను సంప్రదించేందుకు వెళ్లిన తమ అభ్యర్థులకు ఇబ్బందులు కల్పిస్తున్నారని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఎంపీడీఓ కార్యాలయాల వద్ద టీడీపీ గూండాలు గుమిగూడి భయానక వాతావరణం సృష్టిస్తున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై డీఐజీతో పాటు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలి ..
1995లో పరిటాల రవి హయాంలో జరిగిన పరిణామాలు తనను ప్రజా జీవితంలోకి వచ్చేలా చేశాయని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. ఫ్యాక్షన్ కారణంగా ఎన్నో కుటుంబాలు నష్టపోయాయని, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లో ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ ప్రజలకు దగ్గరగా పనిచేశానన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ రక్తపాతం జరగకుండా చూసుకున్నానని, 2021 స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించామని చెప్పారు. రాజకీయ పోటీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలే తప్ప దాడులు, బెదిరింపులతో కాదన్నారు.
నేడు ఆరు మండలాల్లో పర్యటన..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లోని నామినేషన్ కేంద్రాలకు వస్తానని ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభ్యర్థులకు అండగా నిలిచి నామినేషన్ల ప్రక్రియ విజయవంతమయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. 1995 నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదని, ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, సాకే వెంకటేశు, మదిగుబ్బ వీరాంజనేయులు, సిండికేట్‌నగర్ శ్రీరామిరెడ్డి, మరూరు బండి శ్రీనివాసులు పాల్గొన్నారు.


