అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రి (జీజీహెచ్)కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్యాధికారులకు కలెక్టర్ ఆనంద్ సూచించారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బుధవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని విభాగల వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఆస్పత్రి పరిశుభ్రత, మందుల నిల్వ, మంచినీటి సమస్య, డస్ట్ బిన్ల నిర్వహణ, కరెంటు లేని సమయంలో ప్రత్యామ్నాయంగా జనరేటర్, సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. అనంతరం గత సమావేశంలోని అజెండాతో పాటు పలు అంశాలపై సమీక్షించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ – జీజీహెచ్ పాలనాధికారి మల్లికార్జునరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, వైద్యులు పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ: మహిళా హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల కాల వ్యవధి గల కోర్సులో వయోపరిమితి లేదని, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత అయ్యి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు http:// cfw.ap.nic.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడు చేసుకున్న దరఖాస్తులను భర్తీ చేసి, ఈ నెల 31 లోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందజేయాలని తెలియజేశారు. నవంబర్ 15న అర్హుల జాబితాను ప్రదర్శిస్తామని, ఎంపికై న వారికి అదే నెల 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆ ప్రకటనలో తెలిపారు.
హెచ్చెల్సీ ఉద్యోగి సుధాకర్‌యాదవ్ హైడ్రామా
అనంతపురం సెంట్రల్: ధర్మవరం హెచ్చెల్సీ డివిజన్ కార్యాలయం ఎదుట ఓ ఉద్యోగి హైడ్రామా నడిపించాడు. రాజకీయాల్లోకి వెళదామంటే తనకు వీఆర్‌ఎస్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వివరాలు.. ధర్మవరం కుడికాలువ డివిజన్ కార్యాలయం పరిధిలో వడ్డుపల్లి సబ్ డివిజన్ సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఎ. సుధాకర్‌రాజు ఆమరణ నిరాహార దీక్ష పేరుతో ఆందోళనకు దిగాడు. అనంతపురం కార్పొరేషన్‌కు మేయర్‌గా పోటీ చేసేందుకు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశానన్నారు. అయితే వీఆర్‌ఎస్ ఆమోదించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, హెచ్చెల్సీ ఎస్‌ఈ వీఆర్‌ఎస్ చేస్తామని మాట ఇచ్చారని, అందుకు అనుగుణంగా ఫైల్‌ను రెడీ చేశారని తెలిపారు. అయితే కొందరి వల్ల ఆలస్యం చేస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎలాంటి అనుమతి లేకుండా దీక్ష చేయడం నిబంధనలకు విరుద్ధమని హెచ్చెల్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈవిషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి.. దీక్ష విరమించి వెళ్లిపోయారు. దీనిపై హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకర్‌రావును అడగ్గా.. సదరు ఉద్యోగి వీఆర్‌ఎస్ కోసం తన వద్దకు వచ్చారని తెలిపారు. అయితే రూ. 70 లక్షలకు పైగా అతని జీతం నుంచి కోర్టు అటాచ్‌మెంట్స్ ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో వీఆర్‌ఎస్ ఇవ్వడానికి కుదరదని స్పష్టం చేశారు.


