రాప్తాడు రూరల్: అధికార తెలుగుదేశం పార్టీకి ‘స్థానిక’ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. అందుకే రాప్తాడు నియోజకవర్గంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తరఫున ఎవ్వరూ నామినేషన్లు వేయకుండా దాడులు, దౌర్జన్యాలకు దిగుతోంది. పోలీసుల సమక్షంలోనే యథేచ్ఛగా పేట్రేగిపోతోంది. బుధవారం అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీల నామినేషన్ల కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ఎవరినీ అనుమతించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ పరిధికి వెలుపలే టీడీపీ శ్రేణులు గుంపులుగా నిలబడ్డారు. ఈ క్రమంలో సిండికేట్‌నగర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీరామిరెడ్డి, భానుకోట శివ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)పై సీఐ సంతకం తీసుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తుండగా అడ్డుకున్నారు. వారి చేతుల్లోని పత్రాలను లాక్కుని చించేయడంతోపాటు శ్రీరామిరెడ్డిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పాపంపేటలోని విద్యారణ్యనగర్‌కు చెందిన గోపీ, నిజాముద్దీన్ కూడా సంతకాల కోసం కార్యాలయంలోకి వెళ్తుండగా అడ్డుకుని, వారి వద్ద ఉన్న పత్రాలను లాక్కుని బెదిరించారు. చియ్యేడు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థినిని, ఆమె ప్రతిపాదకులను అడ్డుకుని.. నామినేషన్ పత్రాలను చించేశారు. విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా చించేసినట్లు తెలిసింది. కురుగుంటకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు కిరణ్‌కుమార్‌రెడ్డి, మాధవరెడ్డి తమ అభ్యర్థినికి సంబంధించిన పత్రాలపై పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకునేందుకు కార్యాలయంలోకి వెళ్తుండగా అడ్డుకుని పత్రాలను చించేశారు.
రాప్తాడులోనూ అదే తీరు
రాప్తాడు మండల కేంద్రంలో ఉదయం నుంచే టీడీపీ శ్రేణులు నామినేషన్ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో మోహరించాయి. మధ్యాహ్నం మరూరు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పూజారి ప్రతిమను అడ్డుకున్నారు. ఆమె చేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కుని, ఆమెతోపాటు ప్రతిపాదకులపై దాడి చేసి బయటకు పంపారు. ఆ తర్వాత అభ్యర్థిని పూజారి ప్రతిమ, ఆమె ప్రతిపాదకులు సమీపంలోని వైఎస్సార్‌సీపీ నాయకుడు జూటూరు శేఖర్ ఇంటికి వెళ్తే.. అక్కడికీ టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి, సుమారు వందమంది ఇంటిపై దాడికి దిగుతూ రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో చివరకు అక్కడి నుంచి టీడీపీ శ్రేణులను పంపించారు. తాము పరిటాల సునీత వర్గానికి చెందిన వారమంటూ కొందరు కార్యాలయంలోకి వచ్చి బూతులు తిడుతూ తమపై దాడి చేశారని, తమ చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కున్నారని, నామినేషన్ వేస్తే చంపేస్తామంటూ బెదిరించారని పూజారి ప్రతిమ వాపోయారు.
కాపుకాచి.. నామినేషన్లు వేయకుండా చేసి..
అధికార తెలుగుదేశం పార్టీ మండల – జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో తనకు పోటీ లేకుండా చేయాలనుకుంటోంది. ఇందు కోసం ఇతర మండలాల నుంచి వందలాది మంది పార్టీ శ్రేణులను ఆత్మకూరు మండల కేంద్రంలోకి దించింది. నామినేషన్ కేంద్రం వద్ద ఇరువైపులా కాపు కాచింది. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సింగంపల్లి తండా నుంచి వెంకటేష్ నాయక్ తన కుమారుడితో కలిసి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ద్విచక్రవాహనంలో వస్తుండగా.. స్థానిక అయ్యప్ప ఆలయం వద్ద ‘పచ్చ’ గుంపు అడ్డుకుంది. నామినేషన్ కేంద్రంలోకి వెళ్లరాదంటూ హుకుం జారీ చేసింది. తమను దాటుకుని వెళ్లాలనుకుంటే జాగ్రత్త అంటూ హెచ్చరించింది. దీంతో వారు వెనుదిరిగారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉన్న ‘పచ్చ’ గుంపును చూసి పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్ కేంద్రంలోనికి వెళ్లలేకపోయారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆత్మకూరు రావడానికి తోపుదుర్తి నుంచి బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ మూకల దాడి
నామినేషన్ పత్రాలు చించేసి.. బెదిరింపులు
రాప్తాడు నియోజకవర్గం అంతటా ఘటనలు


