ఎన్నికల రూల్‌బుక్‌ పాటించండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల రూల్‌బుక్‌ పాటించండి

Oct 22 2026 12:33 AM | Updated on Oct 22 2026 12:33 AM

అనంతపురం అర్బన్‌: ‘పోలింగ్‌ బూత్‌ మీ చేతుల్లో ఉంటుంది. పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు అక్కడ జరిగే ప్రతి కార్యకలాపానికీ మీదే పూర్తి బాధ్యత. ఎన్నికల విధుల్లో ఉన్నవారు వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలకు తావివ్వకండి. ఎన్నికలకు సంబంధించిన పీఓ హ్యాండ్‌ బుక్‌ (రూల్‌ బుక్‌)లో ఉన్న నిబంధనలు తప్పక పాటించాలి’ అని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్‌ ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులను (ఏపీఓ) ఆదేశించారు. మునిసిపల్‌ సాధారణ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు బుధవారం నగర శివారులోని నీలం సంజీవరెడ్డి ఫంక్షన్‌ హాలులో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో సమయపాలన పాటించాలన్నారు. పీఓ హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదవి అవగాహన చేసుకోవాలని చెప్పారు. నగర పాలక సంస్థ, మునిసిపాలిటీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. విధుల్లో ఉన్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న పీఓలు, ఏపీఓలు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా సహకరించాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ ఆనంద్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ జశ్వంత్‌రావు, జిల్లా ఆడిట్‌ రిజిస్ట్రార్‌ భార్గవ్‌, డీఓలు అయూబ్‌హుసేన్‌, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.

బందోబస్తుకు స్థానిక సిబ్బందిని కేటాయిండి

స్థానిక సంస్థల ఎన్నికల బందోబస్తుకు స్థానిక సిబ్బందిని కేటాయించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్‌ బుధవారం కలెక్టరేట్‌లోని మినీకాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ జగదీష్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు బయట నుంచి బలగాలు రావని స్పష్టం చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో యూనిఫాం ధరించిన సిబ్బంది ఉంటే ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందన్నారు. కాబట్టి స్థానికంగా అందుబాటులో ఉన్న సిబ్బందిని విధులకు కేటాయిస్తారన్నారు. ఎన్నికల రోజున ఇతరత్ర విధులు వద్దన్నారు. ఆ రోజున అత్యవసర సిబ్బందితో బేసిక్‌ సర్వీస్‌ నిర్వహించాలన్నారు. మిగిలిన సిబ్బంది వివరాలను ఎస్పీకి ముందుగానే అందించాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు తమ సిబ్బందితో వర్క్‌అవుట్‌ చేసి ఏయే ప్రాంతాలకు ఎంత మంది సిబ్బందిని కేటాయించగలో స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఆ వివరాలను ఎస్పీకి అధికారికంగా తెలియజేస్తే వారు విధులు కేటాయిస్తారన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో జైళ్ల శాఖ సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శివరామ్‌, అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి, తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ సుధాకర్‌, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ శేషాద్రిశేఖర్‌, ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ రామ్మోహన్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏఓ అలెగ్జాండర్‌, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement