బ్రహ్మసముద్రం: తేనెటీగల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వేపులపర్తి గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. గ్రామానికి చెందిన దివ్యాంగ ఉపాధ్యాయుడు గణేష్ (34) క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఇతరుల బైక్‌పై వెళ్లాడు. మ్యాచ్ సందడితో సమీపంలోని చింతచెట్టులో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచి అక్కడున్న వారిపై దాడి చేశాయి. ఈక్రమంలో అక్కడున్న వారంతా తప్పించుకుని పారిపోయారు. అయితే గణేష్ అక్కడే ఉండిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన రాయదుర్గం, ఆ తర్వాత బళ్లారి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స ఫలించకపోవడంతో అక్కడే మృతి చెందాడు. గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మృతుడికి భార్య నాగమణి, కుమారుడు విహాన్, 18 నెలల కుమార్తె ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి.


