రాయదుర్గం: పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల్లోపు నామపత్రాలు సమర్పించారు. రాయదుర్గం వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా పొరాళ్ల శివకుమార్, కూటమి అభ్యర్థిగా టంకశాల హనుమంతు, కాంగ్రెస్ అభ్యర్థిగా రఫీక్, ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థిగా వెంకటరమణబాబుతో పాటు కూటమి అభ్యర్థిగా టికెట్ ఆశిస్తూ మాజీ కౌన్సిలర్ పద్మజ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 40 వార్డులకు అన్నీ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలు సమర్పించారు. పట్టణ జనాభా 75 వేలు కాగా, 53,696 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 27,827, పురుషులు 25,852, ఇతరులు 17 మంది ఉన్నారు.
ఉత్కంఠ రేపుతున్న పురపోరు
ప్రధాన రాజకీయ పార్టీలు పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పావులు కదుపుతుండడంతో ఉత్కంఠను తలపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పొరాళ్ల శివకుమార్, తన వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల జట్టుతో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఏమూలకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. కూటమిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. చివరి నిమిషం వరకు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు తర్జనభర్జన పడ్డారు. కూటమి చైర్మన్ అభ్యర్థిగా టంకశాల నామినేషన్ సమర్పిస్తే, అదే పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పద్మజ పోటీగా మరో నామినేషన్ వేయడం చర్చకు దారి తీసింది. ఇలా పలు వార్డుల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. రెబల్ అభ్యర్థులతో కూటమికి తలపోటుగా మారింది.
గెలుపుపై ధీమా
వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పొరాళ్ల శివకుమార్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మంచికి మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన మేలును గుర్తుచేస్తున్నారు. ఈ ఒక్క అవకాశం ఇస్తే పట్టణాన్ని సుందరంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా శాయశక్తులా కృషి చేస్తానని కోరుతున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అన్ని వార్డుల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆశీస్సులతో విజయం తప్పక సాధిస్తామని ఘంటా పథంగా చెబుతున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
ప్రధాన పార్టీలు
ముగిసిన నామినేషన్ల ఘట్టం
ప్రచారంలో దూసుకుపోతున్న
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
కూటమిలో తెగని కుమ్ములాటలు
చైర్మన్ సహా పలు వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు


