● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజం
ఉరవకొండ: సీఎం చంద్రబాబుకు ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిపించే దమ్ము లేదా అంటూ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సవాల్ విసిరారు. ఈమేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండున్నరేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమైందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం పడకుండా దాడులు, దౌర్జన్యాలు చేస్తూ రాష్ట్రంలో మారణకాండ సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ఎన్నికల అధికారులు తమ బాధ్యతలను విస్మరించి కూటమి నేతలకు మద్దతు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. కడప, పుంగనూరు, రాయచోటి, పులివెందుల, తిరుపతి, గుత్తి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో దాడులతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీకు అనుకులంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నేతలు చేస్తున్న దాడులే రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓటమికి పునాదులని పేర్కొన్నారు.
ఇద్దరి కంటే ఎక్కువ మంది
పిల్లలున్నా పోటీకి సై
● తొలగిన 30 ఏళ్ల నాటి నిబంధన
బొమ్మనహాళ్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండరాదు అనే నిబంధనను ప్రభుత్వం తొలగించడంతో ఔత్సాహాకులు ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నికల అధికారుల వివరాల ప్రకారం..1994 మే 30న తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం–1994, సెక్షన్ 19(3) ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆనర్హులుగా ప్రకటించారు. గతంలో కొందరు పిల్లల సంఖ్యను దాచిపెట్టి గెలిచినప్పటికీ ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో పదవులు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం 2024 నవంబర్ 24న ఏపీ పంచాయతీ రాజ్ , మున్సిపల్ చట్ట సవరణ బిల్లుల ద్వారా ఈ నిబంధనను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం లభించింది.
పోట్లమర్రి ఎల్లమ్మ
ఆలయంలో చోరీ
బత్తలపల్లి: పోట్లమర్రి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన సమాచారం.. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ తలుపులకు ఉన్న తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయంలో ఉన్న బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న 40 తులాల వెండి కిరీటం, 50 తులాల రెండు వెండి నాగ పడగలు, 18 తులాల వెండి చైను, 20 తులాల వెండి రూపంలో ఉన్న అమ్మవారు, సుమారు రెండు కిలోల వెండి, 4 గ్రాముల బంగారు తాళిబొట్టు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం పూజలు నిర్వహించేందుకు ఆలయ అర్చకులు శ్రీనివాసులు వెళ్లగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


