ఉరవకొండ: హత్యాయత్నాలు, దాడులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలతో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను స్వేచ్ఛగా నామినేషన్ వేయనివ్వకుండా అరాచకపర్వం కొనసాగించారని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వీలు లేకుండా టీడీపీ నేతలు దాడులకు తెగబడటం దారుణమన్నారు. సీనియర్ నాయకులు, వారి వాహనాలపై మారణాయుధాలతో దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఉన్నా ఎలాంటి భద్రత కల్పించకుండా ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. కొన్ని చోట్ల టీడీపీ నాయకుల డైరెక్షన్‌లో పోలీసులే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం కన్పించిందన్నారు. తమ పార్టీ ఎన్నికలను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా టీడీపీ నాయకులకు తొత్తుగా మారిందని ఆరోపించారు.
టీడీపీ దాడులు, దౌర్జన్యాలను
గట్టిగా ఎదుర్కొందాం
ఉరవకొండ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులను గట్టిగా ఎదుర్కొందామని విశ్వ పిలుపునిచ్చారు. నామినేషన్లు వేసుకోవడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పార్టీ అభ్యర్థులకు తాము ఎప్పడు అండగా ఉంటామని, టీడీపీ నాయకుల బెదిరిస్తే తమ దృష్టికి తీసుకోరావాలని తెలిపారు. పార్టీ పట్టణ కన్వీనర్ ఈడిగప్రసాద్, రూరల్ కన్వీనర్ ఎర్రిస్వామిరెడ్డి, మండల సమన్వయకర్త ఓబన్న, రాష్ట్ర నాయకులు బసవరాజు, కౌడిగి గోవిందు, బెలగల్ షమ్ము తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ ధ్వజం


