రాజకీయ రంగంలోకొస్తే ‘గౌరవం’తోపాటు ప్రజాసేవ చేయొచ్చని భావించారు.. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ బద్ధ్దంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు.. అంతే పట్టుదలతో పదవీకాలాన్ని సంపూర్ణంగా పూర్తి చేశారు.. అయితే చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో జెడ్పీ ప్రాదేశిక సభ్యులకు గౌరవ వేతనం అందలేదు.. పదవీకాలం పూర్తయ్యేలోపు కూడా వేతనం అందకపోవడంతో ఈసురోమంటున్నారు. తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా బకాయిల విడుదల విషయంపై ప్రభుత్వం స్పందించలేదని నిట్టూరుస్తున్నారు.
అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 63 మంది జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఉండేవారు. వీరిలో బోయ గిరిజమ్మ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గానూ, తక్కిన 62 మంది సభ్యులుగా కొనసాగారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌కు నెలవారి గౌరవ వేతనంగా రూ. 8 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో జెడ్పీటీసీలకు నెలకు రూ.6వేలు గౌరవ వేతనం అందుతుంది. ఈ లెక్కన ఒక చైర్ పర్సన్, 62 మంది జెడ్పీటీసీలకు కలిపి ఏడాదికి రూ. 50 లక్షలా 88 వేల గౌరవ వేతనం కింద ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి అంటే గత 30 నెలలుగా జిల్లా ప్రాదేశిక సభ్యులకు ఎలాంటి గౌరవ వేతనం చెల్లించలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మొత్తం జెడ్పీటీసీలకు గౌరవ వేతన బకాయి ఇప్పటివరకు రూ. కోటి 72 లక్షలా 59 వేలా 949 అందాల్సి ఉంది.
ఇప్పటికై నా అందేనా..!?
2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 50 లక్షలా 88వేలు, అలాగే 25–26 కు సంబంధించి అంతే మొత్తం అంటే రూ.50 లక్షలా 88వేలతో పాటు 26–27 సంబంధించి సభ్యుల పదవీకాలం ముగిసేంతవరకు చెల్లించాల్సిన మొత్తం ఇప్పట్లో ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఎంత మాత్రం కనిపించలేదు. మరోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సిన గౌరవ వేతనం బడ్జెట్లో చూపించిన మొత్తాలు విడుదలవుతున్నా తిరిగి వెనక్కి వెళ్లడం అంతుపట్టని రహస్యంగామారింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.52 లక్షల పైచిలుకు గౌరవ వేతనాలను విడుదల చేసినట్లు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అదేవిధంగా 25–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 51లక్షలా 16 వేలా280 నిధులు విడుదలయ్యాయి. అయితే ఆ నిధులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాల రూపంలో చెల్లించలేదు. అదే సమయంలో ఆ నిధులన్నీ తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ కావడం గమనార్హం.
ఉమ్మడి అనంత జెడ్పీ ప్రాదేశిక సభ్యుల వివరాలు..
జెడ్పీటీసీలకు అందని గౌరవ వేతనం
గత నెలలోనే ముగిసిన పదవీకాలం
రూ. 1.72 కోట్ల మేర బకాయిలు
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం


