కూడేరు: శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీఏబీఆర్ డ్యాం వద్దనున్న సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు ఎదుట కార్మికులు గడ్డి తింటూ శనివారం వినూత్నంగా నిరసన తెలియజేశారు. తమ డిమాండ్ల సాధనకై తొలి రోజు ప్రాజెక్ట్ ముందు నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ నాలుగు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ భారమైందన్నారు. పండగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం , సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం నేతలు శ్రీనివాసులు, గోవిందరాజులు, ఉదయ్, ఈశ్వరయ్య, శ్రీనివాసనాయక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల కేటాయింపులో దివ్యాంగ ఉద్యోగులకు సాధ్యమైనంత వరకు మినహాయింపు ఇవ్వాలని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఎ.మల్లికార్జున జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు లేఖ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ దృష్టి లోపం ఉన్న ఉద్యోగుల సంఘం ప్రతినిధులు దివ్యాంగుల సమస్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగ ఉద్యోగులు, సిబ్బందికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ ఓటర్లకు అందుబాటులో ఉండే ఓటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, సాధ్యమైనంత వరకు దివ్యాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధికారులకు సూచించింది. అదే సమయంలో దివ్యాంగ ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా అవసరమైన, అందుబాటులో ఉండే సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరింది.
మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
కళ్యాణదుర్గం రూరల్: మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయలోని నామినేషన్ ప్రక్రియను, డిగ్రీ కాలేజ్‌లోని స్ట్రాంగ్‌రూంను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం ఆర్‌డీఓ వసంత్‌బాబు, మున్సిపల్ కమిషనర్ మంజుల, ఎన్నికల ప్రత్యేక అధికారి భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల కేటాయింపులో ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి కోరారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులు, వయోభారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మానవీయ దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేన్సర్, గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు. కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తీవ్ర అంగవైకల్యం కలిగిన వారి ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలుగా ఉన్న మహిళా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఎన్నికల విధుల కేటాయింపులో వెసులుబాటు కల్పించాలని కోరారు. 60 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వయస్సు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.


