కూడేరు: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికులు శుక్రవారం రాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో మోటర్లు పని చేయకుండా స్విచ్ఛాఫ్ చేశారు. ఈ సందర్భంగా తాగునీటి కార్మిక సంఘం నేతలు మాట్లాడారు. ప్రాజెక్ట్‌లో 572 మంది కార్మికులు పని చేస్తున్నట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వేతనాల కోసం సెప్టెంబర్ 1 నుంచి 9వ తేది వరకు సమ్మె చేపడితే జిల్లా కలెక్టర్ స్పందించి తొందరలోనే బిల్ రిలీజ్ ఆర్డర్(బీఆర్ఓ) వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చి సమ్మె విరమింపజేశారన్నారు. బీఆర్ఓ వచ్చింది కానీ అందులో డబ్బులు జమ కాలేదని, నాలుగు నెలలుగా వేతనాలందక అవస్థలు పడుతున్నామని వాపోయారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు వేతనాలు, 60 మంది కార్మికులకు బకాయిపడ్డ గ్రాట్యుటీ ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని వారు స్పష్టం చేశారు. సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌కి సమ్మె నోటీసు ఇచ్చినట్టు తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, సంఘం జిల్లా నేతలు మధుసూదన్, శ్రీరాములు, హరి ప్రసాద్, వన్నూరప్ప, శ్రీనివాసులుతో పాటు కార్మికులు పాల్గొన్నారు.


