పెద్దపంజాణి: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని పుంగనూరు–పలమనేరు హైవే లింగాపురం సమీపం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కదిరికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు సాధిక్ (27), భార్య నఫీజ్, స్నేహితుడు అజర్ దంపతులతో కలసి కారులో కదిరి నుంచి చిత్తూరులోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో కారు నడుపుతున్న సాధిక్ అదుపు చేయలేక లింగాపురం సమీపంలో కల్వర్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సాధిక్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వీరిని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పెద్దపంజాణి పోళీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
యల్లనూరు:అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యల్లనూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చిలమకూరు గ్రామానికి చెందిన గూగూటి చిన్నకుళ్లాయప్ప కుమారుడు శేఖర్ (50)కు మూడెకరాల పొలం ఉంది. వివిధ పంటలు సాగు చేసినా సక్రమంగా పండలేదు. అప్పులు రూ.20 లక్షల వరకు చేశాడు. అలాగే కుమార్తెకు ఇటీవల పెళ్లి చేయగా.. అంతలోనే అల్లుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఒకవైపు అప్పులు, మరోవైపు కుమార్తె జీవితం కష్టాల్లో పడడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం వ్యవసాయ పొలానికి వెళ్లి వేపచెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య బయమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కేబుల్ దొంగల పట్టివేత
బత్తలపల్లి: తంబాపురంలో వెంకటకృష్ణారెడ్డికి చెందిన సపోటా తోటలో అనంతపురానికి చెందిన ఇసాక్, ప్రతాప్ కేబుల్‌ను దొంగలించి మోటారు సైకిల్‌పై పారిపోతుండగా కాపలాదారు సాకే చిన్న పెద్దన్న, కుమారుడు రవి అప్రమత్తమై నిందితులను గురువారం పట్టుకున్నారు. బత్తలపల్లి బ్లూ కోల్ట్స్ సిబ్బంది నిందితులతో పాటు ద్విచక్ర వాహనాన్ని, కేబుల్‌ను స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


