కూడేరు: క్రమ‘శిక్షణ ఉంటే రంగం ఏదైనా రాణించొచ్చు.. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవచ్చు.. దేశభక్తి పెంపొందించుకోవచ్చు.. ఏ కొలువైనా సునాయాసంగా సాధించొచ్చు.. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు.. జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుకోవచ్చు.. కేవలం సైనిక శిక్షణకు మాత్రమే పరిమితం కాకుండా ఐక్యత, క్రమశిక్షణ నినాదంతో ఎన్‌సీసీ (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) వందలాది క్యాడెట్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. పరేడ్, డ్రిల్, శారీరక దృఢత్వంతోపాటు దేశసేవ పట్ల ఆసక్తిని పెంచుతోంది. కూడేరు మండలం బ్రాహ్మణపల్లివద్దనున్న ఎన్‌సీసీ నగర్‌లో ఏటా వందలాది మంది ఎన్‌సీసీ క్యాడెట్లు నాయకత్వ లక్షణాలు, గ్రూప్ (బృంద) స్ఫూర్తి, సామాజిక సేవ, జాతీయ సమైక్యత.. ఇలా ఎన్నో అంశాలపై అవగాహన పొందుతున్నారు.
కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలో అనంతపురం – బళ్లారి రహదారి పక్కన ఎన్‌సీసీ నగర్ 2007 డిసెంబర్ 11న ప్రారంభమైంది. అనంతపురానికి చెందిన అప్పటి కెప్టెన్ కె.ప్రభాకర్ రెడ్డి ఎన్‌సీసీ నగర్ ఏర్పాటు కోసం కృషి చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎన్‌సీసీ నగర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఏటా ఇక్కడ పది శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. ప్రతి క్యాంప్ 10 రోజులు పాటు కొనసాగుతాయి. ప్రతి క్యాంపులో 500 నుంచి 550 మంది క్యాడెట్లు శిక్షణ పొందుతారు. ఈ శిబిరాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి జిల్లాకు చెందిన సుమారు 500–550 మంది క్యాడెట్లు (పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు) శిక్షణ పొందుతారు. శిక్షణ అత్యంత క్రమశిక్షణతో కూడి ఉంటుంది. 18 ఏళ్ల లో సుమారు 90 వేల మంది క్యాడెట్లు శిక్షణ పొంది బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారు.
శిక్షణతో సరికొత్త నైపుణ్యాలు :
ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది. పరేడ్, డ్రిల్, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, గ్రూప్ (బృంద) స్పూర్తి, సామాజిక సేవ, జాతీయ సమైక్యత వంటి అంశాలపై క్యాడెట్లు అవగాహన పొందుతారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. సమయ పాలన, బాధ్యతాయుత ప్రవర్తన, తోటి వారితో సమన్వయంతో పని చేయడం వంటి లక్షణాలు అలవర్చుకోవడానికి శిక్షణా శిబిరాలు దోహదపడతాయి.
ఎన్‌సీసీ శిక్షణతో క్యాడెట్లకు కలిగే లాభాలు...
బంగారు భవిష్యత్‌కు బాటలు:
● ఎన్‌సీసీలో ప్రతిభ చాటి బి, సి సర్టిఫికెట్లు సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్యల్లో ప్రత్యేక కోటా లభిస్తుంది.
● ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత: రక్షణ రంగం (ఆర్మీ, నేవీ ఎయిర్ ఫోర్స్), పోలీస్ శాఖతో పాటు పారా మిలటరీ దళాల ఉద్యోగ నియామకాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రత్యేక వెయిటే జీ, బోనస్ మార్కులు లభిస్తాయి.
నాయకత్వ లక్షణాలు: క్యాంపులో కలిసి జీవించడం ద్వారా విద్యార్థుల్లో జట్టు కట్టేతత్వం (టీమ్ వర్క్), కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్ షిప్ క్వాలిటీస్ మెరుగవుతాయి.
● వ్యక్తిత్వ వికాసం: సమయ పాలన, కఠిన శ్రమ, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే మానసిక ౖధైర్యం శిక్షణతో క్యాడెట్లకు సొంతమతుంది.
జిల్లా : అనంతపురం
ప్రాంతం: కూడేరు (బ్రాహ్మణపల్లి)
ఎన్‌సీసీ నగర్ ఏర్పాటైన తేదీ: 2007 డిసెంబర్ 11
క్యాడెట్లు పాల్గొనే జిల్లాలు
అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల
ఏడాదిలో జరగనున్న క్యాంపులు
(సుమారు): 10
ప్రతి క్యాంపులో పాల్గొననున్న క్యాడెట్లు (సుమారు) : 500 నుంచి 550
ఏడాదిలో శిక్షణ పొందే క్యాడెట్లు (సుమారు) : 5,000 నుంచి 5,500
ఎన్‌సీసీ శిబిరాలతో విద్యార్థుల జీవితాల్లో వెలుగు
ఎన్‌సీసీ నగర్‌లో ఏటా ఏడు శిక్షణ శిబిరాలు


