మరోసారీ మోసమే! | - | Sakshi
Sakshi News home page

మరోసారీ మోసమే!

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మళ్లీ నిరాశే మిగులుతోంది. మెగా డీఎస్సీలోనూ అరకొర పోస్టులతో సరిపెట్టిన ప్రభుత్వం.. తాజాగా విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌లోనూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తగినన్ని పోస్టులు కేటాయించలేదు. ముఖ్యంగా ఎస్జీటీ పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరిగింది. ఎంతో ఆశతో ఉన్న తమను ఈ సారి కూడా ప్రభుత్వం మోసం చేసిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 170 దాకా ఎస్జీటీ ఖాళీలున్నట్లు చూపించి.. తీరా నోటిఫికేషన్‌లో మాత్రం అనంతపురం జిల్లాకు 26 పోస్టులే ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఒక్క ఎస్జీటీ పోస్టు కూడా లేకపోవడం తమను మరింత కలవరపెడుతోందని వాపోతున్నారు.

ఎన్నో ఆశలు..అరకొర పోస్టులు

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందు రోజు ప్రభుత్వం హడావుడిగా డీఎస్సీ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో మొత్తం 108 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించగా.. వాటిలో 66 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 26 ఎస్జీటీ పోస్టులు, ఏడు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, తొమ్మిది స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. ఇక శ్రీసత్యసాయి జిల్లాలో 42 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, ఏడు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, తొమ్మిది స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీ పోస్టులు కలిపి మొత్తం 58 పోస్టులు ప్రకటించారు. సాధారణ ఎస్జీటీ పోస్టులు ఒక్కటీ లేకపోవడం గమనార్హం.

170 ఖాళీలుంటే.. 26 పోస్టులేనా?

ఉమ్మడి జిల్లాలో ఇటీవల 170 ఎస్జీటీ పోస్టులను ఖాళీలుగా చూపించారని, అలాంటప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఇంత తక్కువ పోస్టులు ఎలా ప్రకటిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లాకు కేటాయించిన 26 పోస్టుల్లో తెలుగు, ఉర్దూ, కన్నడ మాధ్యమాలకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారో కూడా స్పష్టత లేదని అంటున్నారు. మాధ్యమాల వారీగా పోస్టుల విభజన జరిగితే తమకు ఎన్ని అవకాశాలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఖాళీలన్నీ భర్తీ చేస్తేనే తమకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పరిమిత సంఖ్యలో పోస్టులు ప్రకటిస్తే ఏళ్ల తరబడి శ్రమించినా ఫలితం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

90 మార్కులొచ్చినా ఉద్యోగం రాదేమో

గత డీఎస్సీలో మంచి మార్కులు సాధించినా పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉద్యోగం పొందలేకపోయామని పలువురు అభ్యర్థులు చెప్తున్నారు. ఈసారి కూడా కేవలం 26 ఎస్జీటీ పోస్టులే ప్రకటిస్తే 90 మార్కులు సాధించినా ఉద్యోగం వస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి చదువుకుంటూ, కుటుంబాల ఆశలను మోస్తూ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న తమకు నోటిఫికేషన్‌ నిరాశ మిగిల్చిందని వాపోతున్నారు. టెట్‌ పరీక్షలను వరుసగా నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఉపాధ్యాయ పోస్టులను మాత్రం తగిన స్థాయిలో భర్తీ చేయకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఖాళీలన్నీ భర్తీ చేయకుండా నోటిఫికేషన్‌లు విడుదల చేయడం వల్ల నిరుద్యోగులకు ఒరిగేదేమిటని నిలదీస్తున్నారు.

డీఈఓను కలిసిన నిరుద్యోగ అభ్యర్థులు..

పోస్టుల కేటాయింపుపై ఆందోళన వ్యక్తం చేసిన నిరుద్యోగ అభ్యర్థులు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ఆయూబ్‌ హుస్సేన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా పోస్టులు ప్రకటించాలని, ఎస్జీటీ పోస్టుల సంఖ్యను పెంచేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

డీఎస్సీ కొత్త ప్రాథమిక నోటిఫికేషన్‌లోనూ అన్యాయమే

ఉమ్మడి అనంతపురం జిల్లాకు అరకొర పోస్టులు

170 దాకా ఎస్జీటీ ఖాళీలుంటే.. నోటిఫికేషన్‌లో 26 మాత్రమే

శ్రీసత్యసాయి జిల్లాలో ఎస్జీటీ పోస్టులు ‘0’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement