● ‘సాక్షి’ కథనంతో స్పందించిన కలెక్టర్ ఆనంద్
రాప్తాడు రూరల్: అనంతపురంరూరల్ మండలం రాచానపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.4లో ఎకరా వంక పోరంబోకు భూమి ఆక్రమణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. స్థానిక టీడీపీ నాయకులు రూ. కోట్ల విలువజేసే స్థలాన్ని ఆక్రమించి, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. వంక పొరంబోకు స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఓ, ఆర్‌ఐ ఇద్దరూ తహసీల్దారుకు గతనెల 30న నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘రూ. 3 కోట్ల ప్రభుత్వ భూమిపై ‘పచ్చ’ కన్ను’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ ఆనంద్ తీవ్రంగా పరిగణించారు. రూరల్ మండల తహసీల్దారు కార్యాలయ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అక్రమార్కులకు ఏమాత్రం సంబంధం లేదని నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వాటిజోలికి వెళ్లకపోవడంపై సీరియస్‌గా పరిగణించారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ ఆర్డీఓను ఆదేశించినట్లు తెలిసింది.
ఉన్నతాధికారుల ఆగ్రహం : ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉంటుంది. రాచానపల్లి భూమి వ్యవహారంలో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలనే ఉన్నతాధికారుల ఆదేశాలు ఒకవైపు, అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు వెరసి రెవెన్యూ సిబ్బంది ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు.
ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టమే.. :
వంక పొరంబోకు స్థలంలో వేసిన ప్లాట్లు ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తాయనో, మరో ఆశతోనే కొనుగోలు చేస్తేమాత్రం తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాగా వంక పొరంబోకు స్థలాన్ని దర్జాగా ఆక్రమించి ప్లాట్లు వేసిన టీడీపీ నాయకులు ఏకంగా సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్‌లలో స్కెచ్‌ను పెట్టి అమ్మకాలకు ప్రచారం చేస్తుండడం విశేషం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం రూరల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


