అనంతపురం అర్బన్: పెన్షన్ పొందడం ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని, అలానే వారికి రావాల్సిన ప్రయోజనాలను అందేలా చూడడమే తమ బాధ్యత అని ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియతో పాటు కలెక్టర్ ఒ.ఆనంద్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. శాంతిప్రియ మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఏజీ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించేందుకు అదాలత్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కరించడం ప్రతిశాఖ బాధ్యత అన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏజీ కార్యాలయ అధికారులు అదాలత్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎస్.కుశాల్ కార్తిక్, అశ్రిత నౌపాడ్, ఖజానా శాఖ డీడీ రమణయ్య, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.


