అనంతపురం అగ్రికల్చర్: దసరా పండుగ వచ్చిందని ఉద్యోగులు, ప్రజలంతా సంబరంగా ఉంటే.. తాము పస్తులుండాల్సిందేనా అంటూ మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈఓలు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగమిచ్చి వెట్టిచాకిరీ చేయించుకుంటోందని, తమను పట్టించుకోలేదంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 334 మంది అవస్థలు పడుతున్నారు. 8 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా అదిగో.. ఇదిగో అంటూ చంద్రబాబు సర్కారు కాలయాపన చేస్తోందని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ, ఆర్‌బీకేలకు అనుబంధంగా అనంతలో 189 మంది, సత్యసాయిలో 145 మంది ఎంపీఈవోలు పనిచేస్తున్నారు. నెలసరి వేతనం రూ.12 వేలు కాగా, ఇన్సెంటివ్ రూపంలో మరో రూ.3 వేలు కలుపుకొని రూ. 15 వేలకు మించి ఇవ్వడంలేదు. గత ఫిబ్రవరి నుంచి వేతనాలు పెండింగ్‌లో పెట్టారు. 12 ఏళ్లుగా పనిచేస్తున్నా అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి ప్రోత్సాహం లేక 334 మంది ఎంపీఈవోలు పెన్‌డౌన్ లాంటి నిరసనలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం, వ్యవసాయశాఖ మంత్రి, ఇతర మంత్రులు, కమిషనర్లకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితంలేకపోయింది.
ఆ ఐదేళ్లూ రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్యం..
గ్రామస్థాయిలో వ్యవసాయశాఖ పరిధిలో రైతులకు చేదోడువాదోడుగా ఉంటారని 2014లో ఎంపీఈఓ వ్యవస్థను తీసుకువచ్చిన చంద్రబాబు.. అలా ఐదేళ్లు రెగ్యులర్ చేయకుండానే నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. సచివాలయాలు, ఆర్‌బీకేలు ఏర్పాటు చేశారు. వేలాది సంఖ్యలో పర్మినెంట్‌గా ఉద్యోగావకాశాలు కల్పించారు. సచివాలయాలు, ఆర్‌బీకేల్లో ఎంపీఈవోలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అర్హత పరీక్ష రాసి, పర్మినెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరోసారి 2024లో చంద్రబాబు అధికారంలోకి రావడంతో తమకు ఉద్యోగభద్రత కల్పిస్తారని ఆశించారు. అధికారంలోకొచ్చి 26 నెలలు పూర్తవుతున్నా పట్టించుకోవడంలేదు.
ఎంపీఈఓలకు 8 నెలలుగా అందని వేతనాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 334 మంది అవస్థలు
అదిగో ఇదిగో అంటున్న బాబు సర్కారు


