● గుంతకల్లులో రూ.8 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి అపహరణ
గుంతకల్లు రూరల్: గుంతకల్లులోని సత్యనారాయణ పేటకాలనీలో గడచిన 4 రోజుల వ్యవధిలోనే దొంగలు రెండోసారి భారీ చోరీకి పాల్పడ్డారు. కాలనీలో సత్యమ్మ అనే మున్సిపల్ శానిటేషన్ వర్కర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న రూ.8 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండిని అపహరించారు. బాధితురాలి వివరాల మేరకు.. గత కొద్ది నెలలుగా సత్యనారాయణ పేట కాలనీలో అద్దె ఇంటిలో ఉంటున్న సత్యమ్మ కసాపురం రోడ్డు సమీపంలోని జర్నలిస్ట్ కాలనీలో స్థలం కొనుగోలు చేసి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టింది. సోమవారం గృహప్రవేశం ఉండటంతో రోజంతా అదేపనిలో ఉండి పూర్తీగా అలసిపోవడంతో రాత్రికి కొత్త ఇంటిలోనే అందరూ ఉండిపోయారు. కాగా సత్యనారాయణ పేట సత్యమ్మ ఉంటున్న అద్దె ఇంటికి తాళం వేసిన విషయాన్ని గుర్తించిన దొంగలు రాత్రి సమయంలో తలుపుకు ఉన్న తాళం కొండీని విరగ్గొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రెండు బీరువాలను తెరచి నగదుతోపాటు, బంగారు, వెండి నగలను ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న సత్యమ్మ బంధువులు ఇంటి వద్దకు వచ్చి చూడగా ఇంటి తలుపులు మాత్రం పూర్తీగా తెరిచి ఉన్నాయి. ఈ విషయాన్ని వెంటనే సత్యమ్మకు తెలియజేయడంతో ఆమె హుటాహుటిన ఇంటికి చేరు కొని ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. దొంగతనం జరిగినట్లుగా గుర్తించిన సత్యమ్మ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


