● శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ అనిత
అనంతపురం: సాంకేతిక పురోగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ బి. అనిత అన్నారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలోని ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి సాంకేతిక సదస్సును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సావనీర్‌ను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రామచంద్ర అధ్యక్షత వహించారు రెక్టార్ ప్రొఫెసర్ బి. అనిత మాట్లాడుతూ.. విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.జేఎన్‌టీయూ అనంతపురం ఇంచార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలరన్నారు.
ఆకట్టుకున్న పోటీలు
ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఈసీఈ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాన్ఫరెన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పేపర్ ప్రజెంటేషన్లు, ప్రాజెక్ట్ ప్రదర్శనలు, టెక్నికల్ క్విజ్ వంటి పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.లత, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.


