అంగన్‌వాడీలపై టెర్మినేషన్‌ అస్త్రం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలపై టెర్మినేషన్‌ అస్త్రం

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

● ప్రాజెక్టు యాప్‌లో వివరాలు నమోదు చేయడంలో జాప్యం చేస్తోందన్న కారణంతో శింగనమల ఐసీడీఎస్‌ సెక్టార్‌ పరిధిలోని ఓ అంగన్‌వాడీ కార్యకర్తకు అధికారుల వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో మెమోలు జారీ చేస్తామని, విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తామనే బెదిరింపులు తారస్థాయికి చేరడంతో మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. ఇటీవల అస్వస్థతతో ఇటీవల జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో అడ్మిట్‌ అయ్యి, చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

● అనంతపురం అర్బన్‌ పరిధిలోనూ మెమోలు, తొలగింపుల బెదిరింపులతో ఓ అంగన్‌వాడీ కార్యకర్త మనోస్థైర్యం కోల్పోయి విధుల్లో ఉండగానే కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెకు సపర్యలు చేశారు. కాస్త కోలుకోగానే కుటుంబ సభ్యులను పిలిపించి ఆమెను అప్పగించారు. ఇలా ఈ రెండు ఘటనలేకాదు.. జిల్లా వ్యాప్తంగా మానసిక ఒత్తిడితో అంగన్‌ వాడీ కార్యకర్తలు సతమతమవుతున్నారు.

యంత్రాల్లా చూస్తున్నారు..

అంగన్‌వాడీ వర్కర్లను రోజంతా యాప్‌ల ముందు కూర్చోబెట్టడం సరికాదు. మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్‌ సమస్యలున్నాయి. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు ప్రక్రియ పూర్తికాకపోయినా 100 శాతం లక్ష్యాలు సాధించాలని ఒత్తిడి చేయడం సరికాదు. సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి ఉద్యోగులను బాధ్యులను చేయడం అన్యాయం. అధికారుల వేధింపులు, నిరంతర పని ఒత్తిడితో పలువురు బీపీ, షుగర్‌ వంటి సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు వారి శ్రమకు తగిన వేతనం, గౌరవం కల్పించాలి. వేధింపులు ఆపకపోతే ఉద్యమాలు చేస్తాం.

– ఎస్‌.నాగేంద్రకుమార్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌

యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు

సమస్యకు

పరిష్కారం చూపాం

విధుల్లో అలసత్వం వహించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెమోలు జారీ చేసింది వాస్తవమే. పోషణ్‌ మాసోత్సవాలు, సాంకేతిక సమస్యల కారణంగా గ్రోత్‌ వివరాలు సక్రమంగా నమోదు చేయలేదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు తెలిపారు. ఈ అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాం.

–సాజిదా బేగం, పీడీ, ఐసీడీఎస్‌

అనంతపురం సిటీ: జిల్లాలో అంగన్‌వాడీలపై యాప్‌ల ఒత్తిడితోపాటు ఉన్నతాధికారుల నుంచి పని భారం పెరిగిపోయింది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలపై టెర్మినేషన్‌ (ఉద్యోగం నుంచి తొలగింపు) హెచ్చరికలతో ఉన్నతాధికారులు బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మానసిక ఒత్తిళ్లతో కొందరు, మనోస్థైర్యం కోల్పోయి మరికొందరు అనారోగ్యం పాలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల శింగనమల సెక్టార్‌ పరిధిలో ఒకరు, అనంతపురం అర్బన్‌ పరిధిలో ఇంకొకరు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందిన విషయం ఉద్యోగ భద్రతపై అంగన్‌వాడీల్లో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతున్నాయి. యాధృచ్ఛికంగానే అయినా ఈ రెండు సెక్టార్లకు సీడీపీఓగా వ్యవహరిస్తున్నది ఒక్కరే కావడం గమనార్హం.

అంగన్‌వాడీల్లో అభద్రతా భావం..

చంద్రబాబు సర్కార్‌ అంగన్‌వాడీలపై యాప్‌ల భారాన్ని పెంచేసింది. ప్రతి నెలా 1 నుంచి 10 లోపు గ్రోత్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉండగా.. ప్రతి నెలా రెండు, మూడు రోజులపాటు నెట్‌వర్క్‌ సమస్యలతో అంగన్‌వాడీలు అవస్థలు పడుతున్నారు. ఈ నెల 10వ తేదీకి మరింత సమయం ఉండగానే 5వ తేదీ నుంచే యాప్‌లలో గ్రోత్‌ వివరాలు నమోదు చేయాలని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. అనంతపురం అర్బన్‌ ఐసీడీఎస్‌ సెక్టార్‌ పరిదిలో సోమవారం షోకాజ్‌ నోటీసుల కలకలం రేగింది. ప్రధానంగా 50 శాతం కంటే గ్రోత్‌ నమోదు తక్కువగా ఉన్న కార్యకర్తలకు మెమోలు జారీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసి, ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా 627 మందికి మెమోలు అందజేశారు. నెలకు రూ.11,500 వేతనంతో జీవితాలను నెట్టుకొస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను సూపర్‌వైజర్‌, సీడీపీఓ స్థాయి అధికారులు, కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్లు సైతం ఒత్తిడికి గురి చేస్తున్నారు. చిన్నపాటి కారణానికీ దుర్భాషలాడడమే కాక, మెమో ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.

చిన్నపాటి తప్పిదాలకే మెమోల జారీ

ఉద్యోగ భద్రతపై ఆందోళన

మానసిక ఒత్తిళ్లలో అంగన్‌వాడీ కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement