పామిడి: పట్టణంలో గుత్తి రోడ్డులోని కరెంట్ ఆఫీసు వెనుక ఉన్న రైల్వే ట్రాక్‌పై బుధవారం సాయంత్రం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సదరు వ్యక్తి గుత్తి – అనంతపురానికి వెళ్తున్న రైలు కింద పడడంతో శరీరం వేరుపడినట్టు లోకో పైలెట్ కల్లూరు రైల్వేస్టేషన్‌లో సమాచారం అందజేశారు. దీంతో గుత్తి హెడ్ కానిస్టేబుల్ నాగరాజు రాత్రి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో ఇద్దరికి చోటు
కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నాయకులు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీల కార్యదర్శులు నియమితులైనట్టు బుధవారం సాయంత్రం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మేధావుల వేదిక కమిటీ ప్రధాన కార్యదర్శిగా వెన్నపూస వెంకటశివారెడ్డి, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శిగా వారాధి విశ్వేశ్వరెడ్డిని నియమించినట్టు తెలియజేశారు.
రిటైర్డ్ తహసీల్దారు పింఛనులో కోత
అనంతపురం అర్బన్: దేవుని మాన్యంలో అక్రమంగా స్వాధీన ధ్రువీకరణ పత్రాలు జారీచేసిన (2018) అప్పటి తహసీల్దారు కె.అన్వర్ హుస్సేన్‌కు ఏడాది పాటు నెలవారీ పింఛన్‌లో 10 శాతం మొత్తాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను సీసీఎల్‌ఏ బుధవారం జారీ చేశారు. 2018లో అనంతపురం తహసీల్దారుగా ఉన్న కె.అన్వర్ హుస్సేన్ అనంతపురం పాతూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మాన్యం పేరు మీద సర్వే నెంబరు 230, 178, 182–2, 2081–9, 2097–6లో ఉన్న దేవదాయ భూమిని అక్రమంగా స్వాధీన ధ్రువపత్రాలు జారీ చేశారని అభియోగంపై విచారణ జరిపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని అన్వర్ హుస్సేన్‌ను ప్రభుత్వం కోరడంతో ఆయన వివరణ ఇస్తూ, తనపై చర్యలు నిలివేయాలని అభ్యర్థించారు. విచారణ అధికారి నివేదికలోని అంశాలను, ఆరోపణ ఎదుర్కొంటున్న అధికారి వివరణను ప్రభుత్వం పరిశీలించింది. ఏడాది పాటు నెలవారీ పింఛనులో 10 శాతం కోతను తాత్కాలికంగా విధించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత శిక్షను ఎందుకు విధించకూడదో 10 రోజుల వ్యవధిలో కారణం చూపాలని అన్వర్ హుస్సేన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
పొలంలో గొడవ; గొడ్డలితో దాడి
యల్లనూరు: పుట్లూరు మండలం తక్కళ్లపల్లి గ్రామంలో పొలం వద్ద ముళ్ల పొదలు తొలగిస్తున్న సమయంలో జరిగిన గొడవలో చాగం రామేశ్వరరెడ్డిపై అదే గ్రామానికి చెందిన చాగం చంద్రశేఖర్‌రెడ్డి, చాగం ఈశ్వరమ్మలు ఇద్దరు దాడి చేసి గాయపర్చినట్లు ఎస్‌ఐ సురేంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు చాగం రామేశ్వర్‌రెడ్డి తన వదిన దేవితో కలిసి ఈనెల 1వ తేదీన పొలంలో ముళ్ల కంపలను తొలగిస్తుండగా అదే గ్రామానికి చెందిన చాగం చంద్రశేఖర్‌రెడ్డి గొడ్డలితో దాడి చేయడంతో చేతులకు రక్తస్రావం అయిందన్నారు. బాధితుడు చాగం రామేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు బుధవారం పుట్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
హిందూపురం(చిలమత్తూరు): టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. పట్టణంలోని మేళాపురం క్రాస్‌లో బుధవారం మధ్యాహ్నం కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ మేలాపురానికి చెందిన బాబా(36)ను ఢీ కొట్టడంతో కాలు నుజ్జునుజ్జు అయ్యింది. క్షతగాత్రుడిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే బాబా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


