రిటైరైనా వదలరు..దివ్యాంగులైనా కనికరించరు! | Allocation of election duties In AP | Sakshi
Sakshi News home page

రిటైరైనా వదలరు..దివ్యాంగులైనా కనికరించరు!

Oct 25 2026 11:46 AM | Updated on Oct 25 2026 11:54 AM

Allocation of election duties In AP

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఎన్నికల విధుల కేటాయింపులో అధికారుల తీరు ఉపాధ్యాయుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఉద్యోగ విరమణ చేసినవారు, దివ్యాంగులు, రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారికీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధులు కేటాయించడంతో ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ డ్యూటీలు వేయడంతో శిక్షణ రోజుల్లో పాఠశాలలను ఎలా నిర్వహించాలనే ప్రశ్న తలెత్తుతోంది. జిల్లా వ్యాప్తంగా  ఎన్నికల విధుల జాబితాలను పరిశీలించిన ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఉద్యోగ విరమణ చేసినా.. విధులా? 
అనంతపురంలోని అబ్దుల్‌ కలాం ఆజాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉర్దూ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేసిన అనంతరాజు శ్రీదేవి సెపె్టంబరు 30న ఉద్యోగ విరమణ చేశారు. అయినప్పటికీ ఆమెకు  ఈ నెల 26, 29 తేదీల్లో అనంతపురం జేఎన్‌టీయూలో నిర్వహించే శిక్షణకు హాజరుకావాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.  ఉద్యోగ విరమణ చేసిన వారికి సైతం ఎన్నికల విధులు కేటాయించడం ఎలా జరిగిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 

దివ్యాంగులకూ తప్పని డ్యూటీలు 
అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్న నాగార్జునకు వంద శాతం దృష్టి వైకల్యం ఉంది.  ఆలమూరు జెడ్పీహెచ్‌ఎస్‌ సోషల్‌ టీచర్‌ రమాదేవికి 90 శాతం వైకల్యం ఉండగా, రుద్రంపేట జెడ్పీహెచ్‌ఎస్‌ సోషల్‌ టీచర్‌ తిప్పయ్య కూడా దివ్యాంగుడే. కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం ఎంపీయూపీ పాఠశాలలో హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.సమీవుల్లాఖాన్‌కు 55 శాతం శారీరక వైకల్యం ఉంది. వీరందరికీ ఎన్నికల విధులు కేటాయించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల విధులు కేటాయించని దివ్యాంగ టీచర్లకూ ఈసారి కేటాయించడం విశేషం.  అనంతపురం నగరంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలోనూ దివ్యాంగ ఉపాధ్యాయులకు విధులు కేటాయించినట్లు తెలిసింది. 

అందరికీ డ్యూటీలేస్తే బడులు నడిచేదెలా? 
అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్‌–1లో ఉపాధ్యాయులందరికీ ఎన్నికల విధుల ఉత్తర్వులు అందాయి.  అనంతపురం రూరల్‌ మండలం సిండికేట్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒకే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరినీ ఎన్నికల విధులకు కేటాయిస్తే, శిక్షణ జరిగే రోజుల్లో విద్యార్థులకు బోధన ఎలా కొనసాగించాలనే ఆందోళన హెచ్‌ఎంలను వేధిస్తోంది. పాఠశాలల నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. 

మినహాయింపులపై స్పష్టత ఏదీ? 
ప్రత్యేక పరిస్థితులు ఉన్న ఉద్యోగులు, దివ్యాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే, విడుదలైన జాబితాల్లో దివ్యాంగులు, ఉద్యోగ విరమణ చేసినవారు, ఏడాదిలోపు పదవీ విరమణ చేయనున్నవారి పేర్లు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (పీఓలు), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (ఏపీఓలు), ఇతర పోలింగ్‌ ఆఫీసర్లుగా (ఓపీఓలు) విద్యాశాఖతో పాటు ఇతర శాఖల ఉద్యోగులను నియమించినప్పటికీ, ఎక్కువగా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకే బాధ్యతలు కేటాయించారు.  శనివారం సాయంత్రం విడుదలైన జాబితాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఖంగుతిన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement