అర్హతలేని సంస్థకు ‘బిడ్‌’ అర్హత | - | Sakshi
Sakshi News home page

అర్హతలేని సంస్థకు ‘బిడ్‌’ అర్హత

Oct 8 2026 12:36 AM | Updated on Oct 8 2026 12:36 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పంచాయతీ ఎన్నికల సామగ్రి సరఫరా టెండర్‌ కేటాయింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం మూడేళ్ల పాటు ఎన్నికల సామగ్రి సరఫరా చేసిన అనుభవం ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ.. అర్హత లేని ఓ సంస్థను టెక్నికల్‌ బిడ్‌లో అర్హత సాధించిన జాబితాలోకి తీసుకోవడంపై పలువురు టెండరుదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని 576 గ్రామ పంచాయతీలు, 6,025 పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన ఎన్నికల, పోలింగ్‌ సామగ్రి, పోలింగ్‌ కేంద్రాల సూచిక బోర్డులు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అవసరమైన స్టేషనరీని సరఫరా చేసేందుకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న సంస్థలను మాత్రమే ఫైనాన్షియల్‌ బిడ్‌కు ఎంపిక చేయాల్సి ఉంటుంది. విష్ణుసాయి ట్రేడర్స్‌ టెక్నికల్‌ బిడ్‌లో అర్హత సాధించడం ప్రశ్నలకు తావిస్తోంది.

అనుభవం లేకున్నా అర్హత ఎలా?

విష్ణుసాయి ట్రేడర్స్‌ గతంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన స్టేషనరీ లేదా ఎలక్షన్‌ మెటీరియల్‌ కిట్లను సరఫరా చేసిన అనుభవం లేదని టెండరుదారులు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల పాటు ఇలాంటి సామగ్రి సరఫరా చేసిన అనుభవం తప్పనిసరిగా పేర్కొన్నప్పటికీ.. ఒక్క ఏడాది కూడా సరఫరా చేయని సంస్థ టెక్నికల్‌ బిడ్‌లో ఎలా అర్హత సాధించిందనేది ప్రధాన ప్రశ్న. ఇదే సంస్థ శ్రీసత్యసాయి జిల్లాలోనూ టెండర్‌ దాఖలు చేసినట్టు తెలిసింది. అక్కడ జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో టెక్నికల్‌ బిడ్‌ను పరిశీలించిన అధికారులు.. ఎలక్షన్‌ మెటీరియల్‌ కిట్ల సరఫరా అనుభవం లేదనే కారణంతో ఆ సంస్థను అనర్హతగా పరిగణించారు. అయితే అనంతపురం జిల్లాలో అదే సంస్థ అర్హత సాధించడం ఎలా సాధ్యమైందో? అధికారులు స్పష్టతివ్వాల్సి ఉంది.

కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు

ఈ విషయంపై అర్హత కలిగిన టెండరుదారులు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విష్ణుసాయి ట్రేడర్స్‌కు టెండర్‌లో అర్హత లేదని, సదరు సంస్థ రిజిస్ట్రేషన్‌ చిరునామాపై కూడా అనుమానాలు ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తులను మరోసారి పరిశీలించి.. అర్హతలను రీ–వెరిఫికేషన్‌ చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. అయితే రీ–వెరిఫికేషన్‌, టెండర్‌ అర్హతపై నిర్ణయం తమ పరిధిలో లేదని, జాయింట్‌ కలెక్టర్‌ స్థాయిలో నిర్ణయం ఉంటుందని డీపీఓ పేర్కొన్నట్లు వారు చెబుతున్నారు. టెక్నికల్‌ బిడ్‌లో అర్హతపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్రక్రియ ముందుకు సాగడం వెనుక ఓ కీలక అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ ఎన్నికల సామగ్రి సరఫరాకు టెండర్లు

అనుభవం లేని ఓ సంస్థను ఫైనాన్షియల్‌ బిడ్‌కు తీసుకెళ్లడంపై చర్చ

సదరు టెండర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఇతర టెండర్‌దారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement