సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి అస్తవ్యస్త, అసమర్థ పాలనను డప్పు కొట్టించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. ప్రభుత్వ నిధులను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియా పాలసీ పేరుతో తమ కార్యకర్తలు, అనుచరులకు అడ్డంగా దోచిపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పథకాలు ఇవ్వడానికి మాత్రం గల్లా పెట్టె ఖాళీగా ఉందని బీద ఏడుపులు ఏడుస్తున్న సీఎం చంద్రబాబు.. ఇలా తమ వారికి ప్రజా సొమ్మును పప్పుబెల్లాల్లా పంచిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం విమర్శలకు తావిస్తోంది.
గూగుల్ ఫాం ద్వారా రిజిస్ట్రేషన్లు
జిల్లా వ్యాప్తంగా సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా పేజీల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూటమి నేతలు సూచిస్తున్నారు. పారదర్శకంగా ప్రక్రియ చేపడుతున్నామని టీడీపీ నేతలు కలరింగ్ ఇస్తున్నా.. వాస్తవానికి టీడీపీకి చెందిన కార్యకర్తలు, ఐటీడీపీ పేజీలను మాత్రమే సెలెక్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఒక్క పోస్టు పెడితే రూ.15 వేలు
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మున్సిపల్ కార్మికులు, అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు నెలకు జీతం రూ.15 వేలకు మించి లేదు. ఈ జీతం కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ, సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే రూ.15 వేలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతుండడం చూసి ఉద్యోగులు రగిలిపోతున్నారు. నెలంతా పనిచేసినా జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఇలా టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తుండడంపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
పింఛన్ల కోసం 63 వేల మంది ఎదురుచూపు
తమను గెలిపిస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా హామీ ఊసే ఎత్తలేదు. ప్రజలను ఊరించి గత నెలలో పింఛన్ల పోర్టల్‌ను ఓపెన్ చేశారు. పది రోజుల తరువాత మూసేశారు. జిల్లా వ్యాప్తంగా 63,112 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా తమకు పింఛన్ ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం పింఛన్‌పై ఎలాంటి ప్రకటనా చేయకుండా సోషల్ మీడియా పేరుతో తమ కార్యకర్తలను పుష్టిగా మేపేందుకు సిద్ధమైన వైనాన్ని చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.
లక్ష ఫాలోవర్స్ పైగా ఉన్న వారు ఒక్క పోస్టు క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తే వారికి రూ.15వేలు ఇస్తారు.
50 వేల నుంచి లక్ష లోపు ఫాలోవర్స్ ఉన్నవారు ఒక పోస్టింగ్ పెడితే రూ.7,500 చెల్లిస్తారు.
25 వేల నుంచి 50 వేల లోపు ఉన్నవారికి పోస్టింగ్‌కు రూ.5వేల చొప్పున ఇస్తారు.
10 వేల నుంచి 25 వేలలోపు వారికి రూ.2,500 ఇవ్వనున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని జస్ట్ పోస్ట్ చేస్తే రూ.500 నుంచి రూ.2 వేల వరకు డబ్బులు చెల్లించనున్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు అవుతున్నా దాని గురించి మాట్లాడటం లేదు. ఈ హామీ అమలు చేయాలంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అధికారం కోసం చంద్రబాబు ఎలాంటి బూటకపు హామీలు ఇస్తారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదు.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని చెప్పి హామీని అటకెక్కించారు.
పేదవారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇచ్చిన ‘పూర్ టు రిచ్’ హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదు.
వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేశారు.
ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీకి చంద్రబాబు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు వరంగా మారనున్న పాలసీ
ఒక్కో పోస్టుకు రూ.15 వేల చొప్పున చెల్లింపులు
హామీలు అమలు చేయకుండా అడ్డదారుల్లో ప్రజాధనం లూటీ
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్న ప్రజానీకం


