● షెడ్యూలు ఖరారు చేసిన విద్యాశాఖ
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్వీయ మూల్యాంకన నమూనా పేపర్–2 (ఎఫ్‌ఏ–2) పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ఆయ్యూబ్ హుస్సేన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1–5 తరగతుల విద్యార్థులకు ఈ నెల 5వ తేదీన ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 6న ఉదయం ఇంగ్లిష్, మధ్యాహ్నం పర్యావరణ శాస్త్రం, 7న ఉదయం ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 10.45 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షలు 1.15 నుంచి 2.30 గంటల వరకు జరుగుతాయి. 6–10 తరగతుల విద్యార్థులకు 5న తెలుగు, గణితం, 6న హిందీ, సాధారణ శాస్త్రం/భౌతిక శాస్త్రం, 7న ఇంగ్లిష్, సామాజిక శాస్త్రం పరీక్షలు నిర్వహిస్తారు. 8న జీవశాస్త్రం, ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఉంటాయి. 6, 7, 8 తరగతులకు ఉదయం 9.30 నుంచి 10.45 గంటల వరకు, 11 నుంచి 12.15 గంటల వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 గంటల వరకు, 2.45 నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించేలా సమయాలను నిర్ణయించారు. 9, 10 తరగతులకు కూడా ఆయా సబ్జెక్టుల వారీగా సమయాలను కేటాయించారు.
ప్రశ్నపత్రాల భద్రతకు ప్రాధాన్యం
1 నుంచి 5 తరగతుల ప్రశ్నపత్రాలను పాఠశాల సముదాయాల్లో, 6 నుంచి 10 తరగతుల ప్రశ్నపత్రాలను మండల వనరుల కేంద్రాల్లో భద్రపరచాలని అధికారులు ఆదేశించారు. ఎంఈఓలు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు ప్రశ్నపత్రాలకు సంరక్షకులుగా వ్యవహరించాలి. ప్రతి పరీక్ష ప్రారంభానికి గంట ముందు మాత్రమే సంబంధిత పాఠశాలలకు ప్రశ్నపత్రాల బండిళ్లను అందజేయాలి. నిబంధనల ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని డీఈఓ స్పష్టం చేశారు.
ఎఫ్‌ఏ–2లో టర్ల్ మూల్యాంకనం
3, 4, 5 తరగతుల ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌తో టీచింగ్ ఎట్ ది రైట్ లెవల్ (టర్ల్) మూల్యాంకనాన్ని అనుసంధానం చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌లో విద్యార్థి సాధించిన అత్యధిక స్థాయిని మాత్రమే నమోదు చేయాలి. బిగినర్, అక్షరాలు, పదాలు, పేరాగ్రాఫ్, కథ, అర్థగ్రహణం అనే ఆరు స్థాయిలుగా మూల్యాంకనం ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్‌లో పేరాగ్రాఫ్ స్థాయి నుంచి పరీక్ష ప్రారంభించి విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి. కథను చదవడంతోపాటు సూచించిన రెండు అర్థగ్రహణ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చినప్పుడే అత్యున్నతమైన ఐదో స్థాయిని నమోదు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గణితంలో ఆపరేషన్లు లేవు, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, పద సమస్యలు అనే ఆరు స్థాయిలుగా మూల్యాంకనం చేయనున్నారు. ప్రతి స్థాయిలో నిర్దేశించిన ప్రశ్నలను సరిగ్గా పరిష్కరించినప్పుడే తదుపరి స్థాయికి వెళ్లాలి. అత్యున్నత స్థాయి అయిన పద సమస్యల స్థాయికి చేరాలంటే నిర్దేశించిన రెండు పద సమస్యలను సరిగ్గా పరిష్కరించాల్సి ఉంటుంది. మూల్యాంకనాన్ని ప్రతి విద్యార్థికీ వ్యక్తిగతంగా, స్నేహపూర్వకంగా, ఒత్తిడి లేని వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. సాధించిన గరిష్ట స్థాయిని టూల్–2 ఓఎంఆర్ షీట్‌తోపాటు పాఠశాల అభ్యసన ప్రగతి పట్టికలో నమోదు చేయాలని డీఈఓ ఆదేశించారు.


