అనంతపురం అగ్రికల్చర్: పప్పుశనగ విత్తనశుద్ధి మొదలుపెట్టినట్లు వ్యవసాయశాఖ జేడీ సాలురెడ్డి తెలిపారు. బుధవారం ఆయన అనంతపురంలో ఉన్న రెండు ప్రాసెసింగ్ ప్లాంట్లలో జరుగుతున్న శుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. రబీలో రైతులు సకాలంలో పంట విత్తుకునేందుకు వీలుగా ప్రాసెసింగ్ వేగవంతం చేసి ఆర్‌బీకేలకు సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు మొదలు పెడతామన్నారు. 35 శాతం రాయితీపై 32,900 క్వింటాళ్ల పంపిణీకి అనుమతులు వచ్చాయని తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 200 కిలోల విత్తన పప్పుశనగ ఇస్తామన్నారు. క్వింటా పూర్తి ధర రూ.9 వేలు కాగా.. అందులో 35 శాతం రాయితీ రూ.3,150 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,850 ప్రకారం చెల్లించాలన్నారు. ఇప్పటికే పుట్లూరు, విడపనకల్లు, ఉరవకొండ ప్రాంతాలకు 1,100 క్వింటాళ్లు సరఫరా చేశామని, మిగతా ఆర్‌ఎస్‌కేలకు కూడా సాధ్యమైనంత తొందరగా పంపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులకు మంచి విత్తనం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అందుకోసం ప్రాసెసింగ్ ప్లాంట్లలో విత్తనశుద్ధి పర్యవేక్షణకు ఏఓలను నియమిస్తామని తెలిపారు.
36 పాఠశాలల్లో 3న ఎస్‌ఎంసీ ఎన్నికలు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో వాయిదా పడిన 36 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలను ఈ నెల 3న నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, అనంతరం ఎస్‌ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడంతో పాటు కమిటీ తొలి సమావేశాన్ని కూడా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
డీఎఫ్‌ఓగా రవీంద్రనాథ్‌రెడ్డి
అనంతపురం న్యూటౌన్: జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ)గా డి.రవీంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన పోలవరం జిల్లా చింతూరు అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2016 బ్యాచ్‌కు చెందిన ఈయన అటవీ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. 2024లో ఆరు నెలల పాటు శ్రీ సత్యసాయి జిల్లా అటవీ శాఖ అధికారిగా విధులు నిర్వర్తించారు. అనంతరం ఆయన కాకినాడ డీఎఫ్‌ఓగా ఏడాది కాలం పనిచేశారు. గత ఏడాదిగా అంటే 2025 సెప్టెంబర్ నుంచి పోలవరం జిల్లా చింతూరు ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తున్నారు. చాలా నెలలుగా అనంతపురానికి రెగ్యులర్ జిల్లా అటవీ అధికారి లేరు.
‘డెలాయిట్’ ల్యాబ్ ఏర్పాటుకు ప్రతిపాదన
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురంలో డెలాయిట్ కంపెనీ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అడ్వాన్స్‌డ్ ల్యాబ్‘ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన చేసినట్లు వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు తెలిపారు. ల్యాబ్ ద్వారా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు అయ్యే ఖర్చు యూనివర్సిటీ, డెలాయిట్ కంపెనీ భాగస్వాములుగా పంచుకుంటాయి. ఈ నేపథ్యంలో డెలాయిట్ కంపెనీ ప్రతినిధులు, యూనివర్సిటీ ఉన్నతాధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు.


