● ఇదీ ఓ ఎమ్మెల్యే సోదరుడి నిర్వాకం
● ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
అనంతపురం టౌన్: భవన నిర్మాణం చేపట్టిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు.. ఇంటి పక్కనే ఉన్న రోడ్డును ఆక్రమించాడు. మొదట చిన్నపాటి షెడ్డు వేస్తే.. మెటీరియల్ కోసమని అంతా అనుకున్నారు. ఆ తర్వాత గోడ కట్టి రోడ్డును పూర్తిగా బంద్ చేసేశాడు. ఇరుగు పొరుగు వారు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం కూడా చోద్యం చూస్తుండటం గమనార్హం. అనంతపురంలోని తపోవనం సర్కిల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్‌కు వెళ్లే సర్వీసు రోడ్డులో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరుడు స్థలం కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అక్కడ బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టాడు. అయితే ఇంటి పక్కనే ఉన్న 25 అడుగుల రోడ్డుపై అతని కన్ను పడింది. అంతే రోడ్డుపై చిన్న షెడ్డు వేశాడు. నిర్మాణ సామగ్రి నిల్వ చేసుకునేందుకని అంతా అనుకున్నారు. కానీ అతని ఆలోచనే వేరు. మూడు రోజుల క్రితం ఏకంగా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేసి.. షెడ్డును పెద్దగా విస్తరించేశాడు. దీంతో కాలనీవాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్డు కబ్జాకు గురవడంతో అర కిలో మీటరుకు పైగా చుట్టేసుకుని రావాల్సి వస్తోంది. ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో అతడిని ఎదిరించే ధైర్యం లేక మిన్నకుండిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.


