● భవనంపై నుంచి పడ్డ విద్యార్థినికి గాయాలు
ఆత్మకూరు: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థిని గాయపడటం కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గురువారం రాత్రి మొదటి అంతస్తులో నుంచి ఓ విద్యార్థిని కిందపడింది. కాలికి, చేతికి గాయాలయ్యాయి. మెట్లపై నుంచి జారిపడిందా.. లేక తనే భవనంపై నుంచి కిందకు దూకిందా అనేది తెలియరావడం లేదు. ఏం జరిగిందని అడిగిన తోటి విద్యార్థుల వద్ద కళ్లు తిరిగి పడిపోయినట్లు బాధితురాలు చెప్పిందని స్పెషలాఫీసర్ (ఎస్‌ఓ) లీమా రోజ్ తెలిపారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఓ చెప్పారు. ఇదిలా ఉండగా బాధిత విద్యార్థినికి తల్లిదండ్రులు లేరని తెలిసింది. విద్యార్థిని భవనంపైకి వెళ్లి కిందపడే వరకు డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఏం చేస్తున్నారని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


