అనంతపురం సెంట్రల్: భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కాలువ పనుల వద్ద అక్రమంగా తరలుతున్న మట్టి తరలింపుపై విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హంద్రీ–నీవా కార్యాలయంలో ఎస్‌ఈ రాజగోపాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తలారి రంగయ్య మాట్లాడుతూ బీటీపీ కాలువ కోసం తవ్విన మట్టిని కొంతమంది రాత్రికిరాత్రే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అక్రమ మట్టి రవాణా వెనుక ఎవరెవరి హస్తం ఉందో తేల్చడానికి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


