ఏమ్మా.. డాక్టర్లు బాగా చూస్తున్నారా? | - | Sakshi
Sakshi News home page

ఏమ్మా.. డాక్టర్లు బాగా చూస్తున్నారా?

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● కలెక్టర్‌ ఆనంద్‌ వాకబు

గుంతకల్లుటౌన్‌: ‘ఏమ్మా..బాగున్నారా..ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు మంచిగా సేవలందిస్తున్నారా..సకాలంలో ఇంజెక్షన్లు, మందులు ఇస్తున్నారా.. ఏమైనా ఇబ్బందులున్నాయా’ అని ఉషారాణి అనే బాలింతతో కలెక్టర్‌ ఆనంద్‌ ఆరాతీశారు. శుక్రవారం సాయంత్రం గుంతకల్లులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్‌ తనిఖీ చేశారు. లేబర్‌వార్డు, బాలింతలు, కంగారూ..మదర్‌కేర్‌ వార్డులను ఆయన పరిశీలించారు. ప్రసవాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తక్కువ బరువు (2.5 కేజీల్లోపు) ఉన్న లేదా నెలలు నిండకుండా పుట్టిన పసిబిడ్డను తల్లి తన ఛాతీకి హత్తుకుంటే బంధాలు బలపడటంతో పాటు వారికి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేందుకు గాను ‘కంగారూ..మదర్‌కేర్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. శిశుమరణాల రేటు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాలోని మరో రెండు సీహెచ్‌సీల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఫలితాలు బాగా వచ్చాక జిల్లా అంతటా ఈ సేవలను విస్తరిస్తామని వెల్లడించారు.

సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతాం

గుంతకల్లు రూరల్‌: సమస్యలు లేని గ్రామంగా నాగసముద్రం గ్రామాన్ని తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. శుక్రవారం నాగసముద్రం గ్రామంలో ‘ఒక్క గ్రామం నాలుగు సందర్శనలు’లో భాగంగా గ్రామసభ నిర్వహించి, ప్రజల నుంచి వివిధ సమస్యలపై 60 అర్జీలు స్వీకరించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై విద్యార్థినులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పరిహారంపై సమీక్ష

వజ్రకరూరు – దోనిముక్కల వరకు నిర్మిస్తున్న 220 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ విద్యుత్‌ టవర్ల ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. రైతులకు పరిహారం అందించే అంశంపై శుక్రవారం గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. పరిహారం ఎంత ఇవ్వాలనే దానిపై మూడు రోజుల్లో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ శ్రీనివాస్‌, వైద్యారోగ్యశాఖ ఆర్డీ శ్రీనివాసరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కట్టా వెంకటేశ్వర్లు, నాగసముద్రం పీహెచ్‌సీ వైద్యుడు నవీన్‌కుమార్‌ బాబు, ఎంపీడీఓ దేవదాస్‌, తహసీల్దార్‌ పుణ్యవతి, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ లీనా వసుంధర, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement