అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 14 మండలాల పరిధిలో 3.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కుందుర్పి 24.6 మి.మీ, గుంతకల్లు 20, నార్పల 10.6, బ్రహ్మసముద్రం, శెట్టూరు 10.2 మి.మీతో పాటు కంబదూరు, పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి, గార్లదిన్నె, పుట్లూరు, విడపనకల్లు, వజ్రకరూరు, పామిడి తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సెప్టెంబర్ నెల సాధారణం 111.6 మి.మీ కాగా ప్రస్తుతానికి 91.1 మి.మీ నమోదైంది. మొత్తం మీద జూన్ ఒకటి నుంచి 291.2 మి.మీకు గాను 27 శాతం తక్కువగా 212.3 మి.మీ నమోదైంది. గత నాలుగు నెలల కాలంలో 20 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. కాగా రాగల నాలుగు రోజులు జిల్లాకు వర్షసూచన లేదని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎలుగుబంట్ల దాడిలో
ఇద్దరు రైతులకు గాయాలు
కుందుర్పి: కరిగానిపల్లికి చెందిన రైతులు చంద్ర, వన్నూరుస్వామి ఎలుగుబంటి దాడిలో గాయపడ్డారు. ఇటీవల పొలాల్లోని వేరుశనగ పంటను తొలగించారు. గురువారం రాత్రి వర్షం వచ్చే సూచన కనపడటంతో వేరుశనగ వామికి టార్పాలిన్ కప్పేందుకు రైతులు చంద్ర, వన్నూరుస్వామి పొలంలోకి వెళ్లారు. అప్పటికే వేరుశనగ వామివద్ద ఉన్న ఎలుగుబంటి రైతులపై దాడిచేసి కరిచింది. తీవ్రంగా గాయపడ్డ చంద్ర అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వన్నూరుస్వామి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గడిచిన రెండు నెలల్లో రైతులపై ఎలుగుబంట్లు దాడి చేయడం ఇది రెండవసారి.
స్వైన్‌ఫ్లూపై అప్రమత్తం
ఉరవకొండ : పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో ఐదేళ్ల చిన్నారికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి.. కాలనీలో పర్యటించారు. స్థానిక వైద్యాధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ సాహితి, మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరపత్రాలు అందజేసి స్వైన్‌ఫ్లూ పట్ల అవగాహన కల్పించారు. మేజర్ పంచాయతీ ఈఓ సయ్యద్ సమీర్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఫాగింగ్, మురికి ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. పారిశుధ్య సిబ్బందితో పందులను ఊరికి దూరంగా తరలించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్‌లు, ఏఎన్‌ఎం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
28 నుంచి 30 వరకు
బ్యాంకుల బంద్
● ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు
అనంతపురం అగ్రికల్చర్: వేతన సవరణ ఒప్పందంలో ఇచ్చిన హామీ మేరకు ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ప్రధాన డిమాండ్‌తో బ్యాంకర్లు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) దేశా వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు సమ్మె చేపట్టనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ, గ్రామీణ, సహకార బ్యాంకులు పూర్తిగా మూత పడనున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఏటీఎంలు, కాల్ సెంటర్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పనిచేస్తాయని బ్యాంకర్లు తెలిపారు. వందల సంఖ్యలో ఉన్న బ్యాంకులు మూడు రోజులు బంద్ కానుండటంతో వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రజలు, ఖాతాదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆదివారం వర్కింగ్‌డేగా ఆదేశాలు జారీ అయినట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. సెలవు రోజు ఆదివారం అన్ని బ్యాంకులు పనిచేయనున్నట్లు తెలిపారు.


