అనంతపురం సిటీ: నగరంలోని ట్రెల్లీస్ స్కూల్‌లో చోటు చేసుకున్న అమానుష ఘటనలో దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్ల మధుసూదనరావు, ఉండవల్లి గాంధీబాబు స్పష్టం చేశారు. ఇటీవల ట్రెల్లీస్ స్కూల్‌లో ఓ చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటనను ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా పరిగణించి సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ట్రెల్లీస్ స్కూల్‌ను వారు సందర్శించారు. పాఠశాలలో పిల్లల రక్షణ కోసం ఎలాంటి ‘చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ‘ అమలులో లేకపోవడాన్ని గుర్తించి యాజమాన్య నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దారుణమైన సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పాఠశాల యాజమాన్యాన్ని కమిషన్ సభ్యులు నిలదీశారు. స్కూల్‌లో సీసీ కెమెరాల మానిటరింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, ‘సేఫ్ టచ్ – అన్ సేఫ్ టచ్‌పై పిల్లలకు తగిన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల రక్షణకు అన్ని రకాల చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. వారి వెంట మండల విద్యాశాఖ అధికారి వెంకటస్వామి, ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి ఉన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
చిన్నారులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని జీజీహెచ్ వైద్యాధికారులకు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సూచించారు. గురువారం జిల్లా సర్వజనాస్పత్రిలోని చిన్న పిల్లల వార్డును కమిషన్ సభ్యులు గాంధీబాబు, మధుసూచనరావు పరిశీలించారు. పసికందు మొదలుకుని ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మానవతా దృక్పథంతో, ఆప్యాయతతో వైద్య చికిత్స అందజేయాలన్నారు. బలహీనంగా ఉన్న చిన్నారులకు మంచి పోషకాహారం అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సంపూర్ణ పోషకాహారం అందించాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు సంపూర్ణ పోషణలో భాగంగా గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఐసీడీఎస్ సిబ్బందిని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఆదేశించారు. నగరంలోని కృపానందనగర్–2 అంగన్‌వాడీ కేంద్రాన్ని కమిషన్ సభ్యులు చల్ల మధుసూదనరావు, ఉండవల్లి గాంధీబాబు గురువారం తనిఖీ చేశారు. బాలామృతం, గుడ్లు, పాలు, బియ్యం, కందిపప్పు, నూనె క్వాలిటీని పరిశీలించి ఇవన్నీ పిల్లలకు గర్భిణులకు, మహిళలకు, బాలింతలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు.
అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు
పిల్లల రక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాలని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు, చల్లా మధుసూదన్‌రావు అధికారులకు సూచించారు. పిల్లల రక్షణ, హక్కుల పరిరక్షణపై గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో వివిధ శాఖల అధికారులతో వారు సమీక్షించారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. పిల్లల పైన ఎలాంటి సంఘటనలు జరిగినా కమిషన్ చాలా సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బాల్యవివాహాలను పూర్తి స్థాయిలో అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల తదితరులు పాల్గొన్నారు.
ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్ల మధుసూదనరావు, ఉండవల్లి గాంధీబాబు
భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యంపై ఆగ్రహం


