తాడిపత్రి రూరల్: స్థానిక వెటర్నరీ ఆస్పత్రి వద్ద నూతన కోర్టుల భవన సముదాయాన్ని ఈనెల 27న హైకోర్టు ప్రధాన న్యామూర్తి లీసాగిల్ పర్చువల్‌గా ప్రారంభిస్తారని తాడిపత్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ రమణారెడ్డి తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి హైకోర్టు జడ్జీలు బీఎస్ భానుమతి, సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి భీమారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొంటారన్నారు.
చెత్త ఇవ్వండి..
సరుకులు తీసుకోండి
● జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి
అనంతపురం న్యూటౌన్: జిల్లాలోని ఇళ్ల నుంచి చెత్తను సేకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి విజయలక్ష్మి తెలిపారు. వచ్చేనెల 24 వరకూ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛరఽథం డ్రైవ్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఈఓ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాల్లో స్వచ్ఛ రథాల ద్వారా పొడి చెత్తను సేకరించి, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామాలను శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు అందించే వినూత్న కార్యక్రమంగా రూపొందించామన్నారు. ప్రజలందరూ పొడి చెత్తను ఒక సంచిలో భద్రపరిచి, కనీసం నెలకు ఒకసారి వచ్చే స్వచ్ఛ రథానికి ఇచ్చి లబ్ధి పొందాలన్నారు. సమాచారం కోసం పంచాయతీ కార్యదర్శి, గ్రీన్ అంబాసిడర్లను సంప్రదించాలన్నారు.
నేడు, రేపు సీపీఎం జీపు జాతా
● కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్
అనంతపురం అర్బన్: వర్షాభావం కారణంగా జిల్లాలో తీవ్రమైన కరువు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు మండలాలు ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం, పంట రుణాలు మాఫీ చేయాలంటూ శుక్ర, శనివారాల్లో జిల్లాలో జీపు జాతా తలపెట్టామన్నారు. 28న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రాప్తాడు నుంచి జీపు జాత ప్రారంభిస్తామన్నారు. రైతులు, కౌలు రైతులు, కూలీలు, వృత్తిదారులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, బాలరంగయ్య, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల జీవితాల్లో
వెలుగులు నింపుతాం
అనంతపురం న్యూటౌన్: దివ్యాంగుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం పలు సేవలు, సంక్షేమ కార్యక్రమాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నగరంలోని ఎం.వై.ఆర్ ఫంక్షన్ హాల్‌లో గురువారం విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా–వయోవృద్ధుల సంక్షేమశాఖ వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో మూడు చక్రాల స్కూటర్లను ఉచిత పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 70 మంది దివ్యాంగులకు (ఒక్కో మోటారు వాహనం విలువ రూ. 1,20,000) మూడు చక్రాల స్కూటర్ల ఉచిత పంపిణీ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న దివ్యాంగులలో ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మందికి యూడీఐడీ కార్డులు పంపిణీ చేశామన్నారు. రాయలసీమ రీజియన్‌లో అనంతపురం జిల్లా దివ్యాంగుల సంక్షేమంలో రాష్ట్రంలోనే మోడల్‌గా నిలిచేలా అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ కార్పొరేషన్ ద్వారా సంపూర్ణ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు , వయోవృద్ధుల సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


