● డబ్బు చెల్లిస్తేనే ఆన్‌లైన్‌లో పేరు తొలగిస్తామంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం
● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
కళ్యాణదుర్గం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ నాశనం అయింది. కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన దానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వివరాలు... బాధిత విద్యార్థిని తల్లి జ్యోతి తెలిపిన వివరాల మేరకు... కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామానికి చెందిన జ్యోతి, కృష్ణమూర్తి దంపతుల కుమార్తె నిత్యశ్రీ 2023–24లో స్థానికంగా ఉన్న శ్రీదేవి ప్రైవేట్ స్కూల్‌లో ఉచిత విద్య పథకానికి ఎంపికై ంది. అయితే అక్కడ విద్యార్థులు లేకపోవడంతో ఒంటిమిద్ది సమీపంలోని రత్నాకర్ స్కూల్‌లోకి 1వ తరగతిలో ఉచిత సీటులో చేరింది. అప్పటి నుంచి 3వ తరగతి వరకు అక్కడే విద్యను అభ్యసించింది. అయితే ఇంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిత్యశ్రీని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేదుకు విద్యార్థి తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అయితే నిత్యశ్రీకి ప్రభుత్వం నుంచి పడాల్సిన డబ్బు జమ కాలేదని, రూ.70 వేలు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని రత్నాకర్ స్కూల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. దీనిపైసోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఎంఈఓ కలగజేసుకోని రత్నాకర్ స్కూల్‌లో టీసీని ఇప్పించి, ఫీజుమాత్రం చెల్లించాల్సిందే అని చెప్పడంతో విద్యార్థి తల్లితండ్రులకు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.
ఆన్‌లైన్ డేటాతో చిక్కు
రత్నాకర్ స్కూల్ ఇచ్చిన టీసీని నిత్యశ్రీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు. అయితే రత్నాకర్ స్కూల్ యాజమాన్యం విద్యార్థిని వివరాలను ఆన్‌లైన్‌లో తొలగించలేదని, అది తొలగిస్తేనే మీకు ఇక్కడ అడ్మిషన్ ఇస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. ఇదే అంశంపై వారం రోజులుగా నిత్యశ్రీ తల్లిదండ్రులు అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకపోయింది. దీంతో నిత్యశ్రీని చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా విద్యార్థి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు జ్యోతి, కృష్ణమూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు.


