కాలువ మట్టి.. కొల్లగొట్టి | - | Sakshi
Sakshi News home page

కాలువ మట్టి.. కొల్లగొట్టి

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

బీటీపీ కాలువ పనుల్లో దోపిడీ

రాత్రికి రాత్రే తరలిస్తున్న ‘పచ్చ’ నేతలు

మట్టి రవాణాను అరికట్టని అధికారులు

● మైనింగ్‌ చట్టాల ప్రకారం కాలువ తవ్వకాల మట్టిని కాంట్రాక్టర్‌ సొంత పనులకు తరలించకూడదు. విక్రయించకూడదు. నిర్దేశించిన ప్రభుత్వ స్థలంలోనే డంప్‌ చేయాలి.

● అదేవిధంగా మట్టిని తరలించాలంటే ప్రభుత్వానికి నిర్ణయించిన సీనరేజ్‌ రుసుం చెల్లించి అనుమతి పత్రాలు పొందాలి.

● కాలువ నిర్మాణాల కోసం తవ్విన మట్టిని తరలించాలంటే సంబంధిత ఆర్డీఓ/ తహసీల్దార్‌ వద్ద నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తప్పనిసరి.

● మట్టి తరలించే వాహనానికి మైనింగ్‌ శాఖ జారీ చేసిన వేబిల్లు తప్పనిసరిగా ఉండాలి.

● ఈ బిల్లులో మట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు. ఎంత పరిమాణం ఉందో స్పష్టంగా ఉండాలి.

● ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మట్టి తరలించాలి.

కళ్యాణదుర్గం: బీటీపీ (భైరవానితిప్పప్రాజెక్టు) కాలువ పనుల పేరుతో మట్టి దోపిడీ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. రాత్రివేళ్లల్లో యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ రవాణా స్థానికంగా చర్చనీయాంశమైంది. జీడిపల్లి నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టు వరకు కాలువ తవ్వకం పనులు సాగుతున్నాయి. కాలువ కోసం తీసిన మట్టిపై అధికార టీడీపీ నాయకులు కన్ను పడింది. సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ కంపెనీ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే టిప్పర్ల ద్వారా కాలువ మట్టిని తరలించుకుపోతోంది. ఇదే అదనుగా పలువురు ‘పచ్చ’ నేతలు భారీ మొత్తంలో ప్రైవేట్‌ భూముల్లో డంప్‌ ఏర్పాటు చేసుకుని.. గుట్టుగా అమ్ముకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా పొలాలకు, రస్తాలకు కూడా కాలువ మట్టిని వినియోగించుకోవడం కొసమెరుపు.

రూ.లక్షల్లో మట్టి దోపిడీ

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం– అనంతపురం ప్రధాన రహదారి ఒంటిమిద్ది వద్ద, కళ్యాణదుర్గం– బెంగళూరు ప్రధాన రహదారి నారాయణపురం వద్ద బీటీపీ కాలువ పనుల నిర్మాణాల కోసం తవ్విన మట్టిని రాత్రికి రాత్రే ‘తమ్ముళ్లు’ అక్రమంగా రవాణా చేస్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్ల ద్వారా మట్టిని తరలించేస్తున్నారు. ఇలా పదుల సంఖ్యలో టిప్పర్లను పెట్టి రూ.లక్షల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు

నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరిధిలోని మట్టిని తరలించాలన్నా, వినియోగించాలన్నా సంబంధిత మైనింగ్‌, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. కానీ కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రతిపక్షం, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికై నా బీటీపీ కాలువ మట్టి అక్రమ రవాణాను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరుతున్నారు.

ఇవీ నిబంధనలు...

ఇక్కడ కనిపిస్తున్న మట్టి దిబ్బలు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోనివి. పక్కనే ఒంటిమిద్ది వద్ద బీటీపీ కాలువ పనులు జరుగుతున్నాయి. ఓ టీడీపీ నాయకుడు తనకున్న పలుకుబడితో రాత్రికి రాత్రే కాలువ మట్టి అక్రమ రవాణాతో దోపీడికి తెరలేపాడు. అనంతపురం ప్రధాన రహదారి పక్కనే ప్రైవేట్‌ పొలంలో మట్టిని నిల్వ ఉంచాడు. దీని విలువ సుమారు రూ.5 లక్షలకు పైగానే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement