● డీఆర్‌ఓ ఫిర్యాదుతో కేసు నమోదు
అనంతపురం అర్బన్: తాడిపత్రిలోని ఓ భూమికి సంబంధించి కలెక్టరేట్‌లోని ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. డీఆర్‌ఓ మలోల ఫిర్యాదు మేరకు అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఐపీసీ466, 468/బీఎన్‌ఎస్ 336 (3), 337 కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి మండలం తాడిపత్రి గ్రామ సర్వే నంబరు 770–ఇ2, సీసీ నంబరు 2963/75 ఉండగా... సంబంధిత ఎంట్రీలో సర్వే నంబరు 709–ఇ2, సీసీ నంబరు 2968/75గా మార్పు చేసినట్లు గుర్తించారు. ఈ మార్పుల ఆధారంగా గతంలో అనంతపురం భూ సంస్కరణల విభాగం ప్రత్యేక తహసీల్దారు 2023 మే 9న సంబంధిత భూమి ల్యాండ్ సీలింగ్ చట్టం పరిధిలోకి రాదని ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లు... అలాగే ఈ ఏడాది మార్చి 16న తాడిపత్రి తహసీల్దారుకు పంపిన లేఖలో సర్వే నంబరు 770–ఇ2లో 2.40 ఎకరాల భూమి సంబంధిత రిజిష్టర్‌లో నమోదు కాలేదని పేర్కొన్నట్లు దర్యాప్తులో తేలింది.
గతంలో కలెక్టర్ విచారణ..
ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆనంద్ గతంలో స్వయంగా విచారణ చేసి ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లోని నమోదులో మార్పులు జరిగినట్లు గుర్తించారు. తహసీల్డారు కార్యాలయం ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో 17, 18 పేజీలు లేకపోవడం, 1–బి రిజిష్టర్, అడంగల్‌లో డి.పట్టాగా నమోదు ఉండడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో సీలింగ్ ల్యాండ్ ప్రస్తావన ఉండడం, ఆర్డీఓ కార్యాలయంలోని ల్యాండ్ సీలింగ్ రిజిష్టర్‌లో సీసీ నంబరు 2963/75 తాడిపత్రి కింద సర్వే నంబరు 770–ఇ2లో 2.40 ఎకరాలు సంబంధించిన నమోదు ఉండడాన్ని కలెక్టర్ గుర్తించారు. ఇందుకు తాడిపత్రి ఇన్‌చార్జ్ తహసీల్దార్ సోమశేఖర్, ఎంఆర్‌ఐ ఈశ్వర్‌రెడ్డి, వీఆర్‌ఓ వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ షఫీలను బాధ్యులను చేస్తూ గత నెల 17న సస్పెండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం డీఏఓ కుల్లాయప్పకు, డీటీ రాజేంద్రప్రసాద్‌కు, కలెక్టరేట్ భూ రికార్డుల విభాగం జూనియర్ అసిస్టెంట్ పవన్‌కుమార్‌కు చార్జ్‌మెమో ఇచ్చారు.


