అనంతపురం అగ్రికల్చర్: చాన్నాళ్ల తర్వాత జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 10 మండలాల పరిధిలో 3.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరులో 42.6 మి.మీ మేర వర్షం కురిసింది. శింగనమల 20 మి.మీ, నార్పల 18.6 మి.మీతో పాటు కూడేరు, గుత్తి, యల్లనూరు, బ్రహ్మసముద్రం, అనంతపురం రూరల్, యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. కాగా అక్కడక్కడా బలమైన గాలులు వీయడంతో ఆత్మకూరు మండలం సనపలో 15 మంది రైతులకు చెందిన 45 ఎకరాల అరటి తోటలు నేలవాలడంతో రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీనిపై ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేసినట్లు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాగల నాలుగు రోజులూ వర్షం పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి, రీసెర్చ్ అసోసియేట్ కె.పావని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో 19న 6.3 మి.మీ, 20న 8.8 మి.మీ, 21న 10 మి.మీ, 22న 10.1 మి.మీ, 23న 6 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో 19న 6.4 మి.మీ, 20న 16 మి.మీ, 21న 8 మి.మీ, 22న 10 మి.మీ, 23న 8.8 మి.మీ మేర వర్షం పడే సూచన ఉందన్నారు.


